ఇద్దరి వ్యక్తుల నుండి రూ.87 లక్షలు కొట్టేసిన సైబర్ చీటర్స్

అధిక లాభాలను ఆశ చూపిస్తూ... హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుండి రూ.87 లక్షలను సైబర్ చీటర్స్ దండుకున్నారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్మాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఆన్లైన్ లో రాండీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.  ఆస్ట్రేలియా కంపెనీ హైపర్ వర్త్ ప్రతినిధిగా తనను పరిచయం చేసుకున్నాడు. తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. మొదట్లో కొంత మేరకు లాభాలు ఇస్తూ నమ్మకం కలిగేలా చేశాడు. ఆ తరువాత బాధితుడు రూ.50 లక్షలు ఒక్కసారిగా ఇన్వెస్ట్ చేశాడు. అదే బాధితుడు మయాంక్ అనే మరో వ్యక్తికి ఇదే తరహాలో ఇన్వెస్ట్మెంట్ పేరిట 12 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పటి నుండి రాండీ , మయాంక్ లు ఎన్ని ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని బాధితుడు గ్రహించాడు. దీనితో బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

మరో కేసులో నగరానికి చెందిన ఓ మహిళ పార్ట్ టైం జాబ్ కోసం టెలిగ్రామ్ లో ఓ సైబర్ చీటర్ ను ఆశ్రయించింది. జాబ్ వర్క్ ఇవ్వాలంటే మొదట కొంత డబ్బు చెల్లించాలని కండిషన్ పెట్టాడు. నమ్మిన మహిళ విడతల వారిగా 25 లక్షల వరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా డబ్బులు చెల్లించాలని అడగడంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.