బాణాసంచా తయారు చేసే క్రమంలో పేలుళ్లు సంభవించి ఇద్దరు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్ లోని గుణ లో జరిగింది. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో దీపావళి పండుగ కోసమని టపాకాయలు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన గురించి సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
దీపావళీ పండుగ సమయంలో దేశంలో ఎక్కడో చోట ఈ తయారీ కేంద్రాల్లో పేలుళ్లు సంభవిస్తున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. అనుమతి లేకుండా జనావాసాల్లో ఇలాంటి పేలుడు పదార్ధాలతో బాణాసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రాకర్స్ తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడి వికలాంగులవుతున్నారు. ప్రతీ ఏడాది ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ కోటి లింగాల దేవాలయ సమీపంలో బాణాసంచా పేలి 10 మంది మృతి చెందారు.