మన దేశంలో కేటుగాళ్లు ఎక్కువైపోయారు. కష్టపడి పనిచేసి సంపాదించడం కంటే ఈజీ మనీ కోసం దొడ్డిదారులు తొక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. కొందరు యువకుల్లో ఈ ఆలోచనలు మరింత ముదిరి అలవోకగా అడ్డదారులు తొక్కుతున్నారు.
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ కంపెనీనే మోసం చేసిన ఇద్దరు ప్రబుద్ధుల గురించిన వార్త ఇది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 రాష్ట్రాల్లో ఈ ఇద్దరు యువకులపై కేసులు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో మోసాలకు పాల్పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.
అసలు ఈ ఇద్దరూ ఏం చేశారంటే.. అమెజాన్ను ఎలా మోసం చేశారంటే.. అమెజాన్ నుంచి రాజ్ కుమార్ మీనా(23), సుభాష్ గుర్జార్(27) అనే రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు కొన్ని ప్రొడక్ట్స్ను ఆర్డర్ చేస్తారు. వాటిలో కొన్ని ఎక్కువ ధర ఉండేవి, కొన్ని తక్కువ ధర ఉండేవి ఉండేలా చూసుకుంటారు. ఫేక్ ఐడెంటిటీస్తో ఈ వస్తువులను ఆర్డర్ చేసేవాళ్లు.
ఆ వస్తువులను డెలివరీ చేసే సమయంలో అమెజాన్ డెలివరీ ఏజెంట్లను మాటల్లో పెట్టి, ఏమార్చి లో కాస్ట్ స్టిక్కర్లను హై కాస్ట్ వస్తువులకు, హై కాస్ట్ వస్తువుల స్టిక్కర్లను లో కాస్ట్ వస్తువులకు మార్చేసేవాళ్లు. ఆ తర్వాత కావాలనే తప్పుడు ఓటీపీలను డెలివరీ ఏజెంట్లకు చెప్పి, అలా చేసి ఇలా చేసి ఎక్కువ ఖరీదైన వస్తువుల ఆర్డర్ ను క్యాన్సిల్ చేసేవాళ్లు.
డెలివరీ ఏజెంట్లకు స్టిక్కర్లు మార్చిన విషయం తెలియక తక్కువ ఖరీదైన వస్తువులను ఎక్కువ ఖరీదైన వస్తువులనుకుని రిటర్న్ తీసుకెళ్లే వాళ్లు. ఆ తర్వాత ఈ కేటుగాళ్లిద్దరూ ఎక్కువ ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను బయట తక్కువ ధరకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుని జల్సా చేసుకునేవాళ్లు. ఇదీ ఈ ఇద్దరూ కలిసి 8 రాష్ట్రాల్లో చేసిన దందా. ఒక రాష్ట్రంలో దొరికిపోగానే మరో రాష్ట్రానికి వెళ్లిపోయేవాళ్లు. వీళ్ల మోసాన్ని అమెజాన్ డెలివరీ ఏజెంట్ ఒకరు పసిగట్టడంతో ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు. మంగళూరు పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.