రాయికల్, వెలుగు : ఆలయానికి సంబంధించిన బోర్డుపై మా గ్రామం పేరు ఉండాలంటే.. మా ఊరి పేరే ఉండాలంటూ రెండు గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో జరిగింది. మండలంలోని కొత్తపేట గ్రామం నుంచి శివాజీనగర్ వేరుపడి కొత్త గ్రామంగా ఏర్పడింది. దీంతో గ్రామంలో ఉన్న నాగాలయం బోర్డుపైన శివాజీనగర్ పేరు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేయడం రెండు గ్రామాల మధ్య గొడవకు కారణమైంది. సమస్యను పరిష్కరించేందుకు బుధవారం సమావేశం నిర్వహించగా రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఒకరినొకరు తిట్టుకుంటూ దాడులకు దిగారు. దీంతో జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్‌ఖాన్, ఎస్సై అజయ్, తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ ఖయ్యాం ఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులను చెదరగొట్టారు.
నాగాలయం బోర్డుపై కొత్తపేటతో పాటు శివాజీనగర్పేరు పెట్టాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేయగా, పాత పద్ధతి ప్రకారమే కొత్తపేట అనే ఉండాలని ఆ ఊరి ప్రజలు స్పష్టం చేశారు. దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అప్పటి వరకు ప్రజలు సామరస్యంగా ఉండాలని సీఐ సూచించారు. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రెండు గ్రామాల మధ్య నెలకొన్న వివాదం మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై పడింది. కొబ్బరికాయల అమ్మకం, దుకాణాల వేలం టెండర్లు నిలిచిపోయాయి.