పెండ్లయిన రెండు వారాలకే భర్త హత్య.. ప్రియుడితో కలిసి భార్య దారుణం

పెండ్లయిన రెండు వారాలకే భర్త హత్య.. ప్రియుడితో కలిసి భార్య దారుణం
  • ఉత్తరప్రదేశ్​లోని ఔరయాలో  ఘోరం 

ఔరయా: ఉత్తరప్రదేశ్‌‌లో దారుణం జరిగింది. పెండ్లయిన రెండు వారాలకే భర్తను హత్య చేయించిందో భార్య. ఔరైయా జిల్లాకు చెందిన దిలీప్‌‌కు ప్రగతి యాదవ్‌‌తో ఈ నెల 5న వివాహమైంది. అయితే ఆమెకు అంతకుముందే లవర్ ఉన్నాడు. అనురాగ్ యాదవ్ అనే అబ్బాయితో నాలుగేండ్లుగా రిలేషన్‌‌పిప్‌‌లో ఉంది. కానీ ఇది నచ్చని ప్రగతి తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా దిలీప్‌‌తో పెండ్లి చేశారు. ఈ క్రమంలో వివాహమైన తర్వాత అనురాగ్‌‌ను కలుసుకోవడం ప్రగతికి కష్టంగా మారింది. 

దీంతో దిలీప్‌‌ను చంపేయాలని వాళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రామాజీ చౌదరి అనే కాంట్రాక్ట్ కిల్లర్‌‌‌‌ను కలిశారు. దిలీప్‌‌ను హత్య చేస్తే రూ.2 లక్షలు సుపారీ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి ఒప్పుకున్న రామాజీ చౌదరి.. దిలీప్‌‌ను చంపేందుకు పథకం వేశాడు. ఈ నెల 19న కొంతమందితో కలిసి దిలీప్‌‌ను పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అతణ్ని తీవ్రంగా కొట్టి, తుపాకీతో కాల్చాడు. అనంతరం అక్కడి నుంచి అందరూ పారిపోయారు. రక్తమోడుతూ పొలాల్లో పడి ఉన్న దిలీప్‌‌ను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. మొదట బిధునా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌కు, అక్కడి నుంచి సౌఫయ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

కండీషన్ సీరియస్‌‌గా ఉండడంతో మధ్యప్రదేశ్‌‌లోకి గ్వాలియర్‌‌‌‌కు తరలించారు. మళ్లీ అక్కడి నుంచి ఈ నెల 20న ఔరైయాలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ తెల్లారే దిలీప్‌‌ చనిపోయాడు. దీనిపై అతని సోదరుడు కంప్లయింట్ చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కాంట్రాక్ట్ కిల్లర్ రామాజీ చౌదరి, ప్రగతి, ఆమె ప్రియుడు అనురాగ్‌‌ను అరెస్టు చేశారు. వారి వద్ద రెండు పిస్తోల్స్, నాలుగు క్యాట్రిడ్జ్‌‌లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.