మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ పట్టణ శివారు ఏటి గడ్డ తండా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంగినేని సాయిరాం, లక్ష్మణ్, సాయి తేజ, వెంగళదాసు సాయిరాం, రవి తేజ అనే ఐదుగురు యువకులు.. వరంగల్ నుంచి కారులో మారేడుమిల్లికి విహార యాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన వెంగళదాసు సాయిరాం, రవి తేజలు ఘటనాస్థలంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన రవి తేజ.. వరంగల్ ఎసిబిలో పని చేస్తున్న ASI కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.