నర్సింహులపేట, వెలుగు: కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై ఇద్దరు యువకులు చనిపోగా.. మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం రామన్నగూడెంకు చెందిన బోగోజు శ్రవణ్, షేక్ రహీం పాషా, ఉపేందర్ జూన్ 10న ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. గ్రామానికి చెందిన మరికొంత మంది ఫ్రెండ్స్ తో కలసి కల్లు, మద్యం తాగారు. వారిలో మొదట బోగోజు శ్రవణ్(28) అస్వస్థతకు గురికాగా.. లోకల్ గా చికిత్స తీసుకున్నాడు. ఆరోగ్యం మెరుగవకపోవడంతో మహబూబాబాద్ లో ఆసుపత్రికి తరలించారు.
అక్కడ కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చికిత్స కోసం ఖమ్మంకు తీసుకువెళ్లారు. కిడ్నీ సమస్య ఉన్నట్టు గుర్తించిన డాక్టర్లు డయాలసిస్ అవసరమంటూ హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శ్రవణ్ బుధవారం మృతిచెందాడు. శ్రవణ్ లోకల్‌గా చికిత్స తీసుకుంటున్న టైమ్‌లోనే షేక్ రహీంపాషా(30), ఉపేందర్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. రహీంపాషా కు కామెర్లు, కిడ్నీ సమస్యలు రావడంతో హైదరాబాద్ కు తరలించగా.. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ అతను కూడా బుధవారం చనిపోయాడు. మరో యువకుడు ఉపేందర్ కామెర్ల సమస్యతో ఖమ్మం ఆస్పత్రిలో చేరగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు.
గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఒకేసారి అస్వస్థతకు గురికావడం, ఒకే రకమైన ఆరోగ్య సమస్యలతో బాధపడడం, వారిలో ఇద్దరు మృతిచెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కొడుకు మృతిపై అనుమానం ఉందని శ్రవణ్ తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్ చెప్పారు.