ఎంపీ ఎలక్షన్స్​ తర్వాత కాంగ్రెస్​లోకి 20 మంది బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు : మంత్రి ఉత్తమ్​

లోక్ సభ ఎన్నికల తర్వాత 20 మంది బీ‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ముగ్గురు బీ‌ఆర్‌ఎస్ శాసన సభ్యులు తమ పార్టీలో చేరినట్టు చెప్పారు.  శనివారం హుజూర్ నగర్ నియోజక వర్గంలోని మట్టంపల్లి, గరిడేపల్లి, పాలకీడు, నేరేడుచర్ల మండలాల్లో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి తరఫున ఉత్తమ్​కుమార్​రెడ్డి  ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో  బీ‌‌ఆర్‌‌ఎస్, బీ‌‌జేపీ క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా రావని తెలిపారు. పదేండ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ, మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేశాయని మండిపడ్డారు.  ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చాక  కులగణన చేపడతామని హామీ ఇచ్చారు.  

బీఆర్ఎస్​ను​ ప్రజలు బొందపెట్టారు

అక్రమాలకు, అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్​ను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బొంద పెట్టారని ఉత్తమ్ అన్నారు. ఆ పార్టీ 104 సీట్ల నుంచి 39 సీట్లకు వచ్చిందని,  లోక్ సభ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్​ కనుమరుగు కావడం ఖాయమని తెలిపారు.  కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగిందని, ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. ఎన్నికల తర్వాత  అర్హులకు రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.  రఘువీర్​రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రఘువీర్​రెడ్డిని  ఆశీర్వదించాలని  మాజీ సీ‌‌ఎల్పీ కుందూరు జానారెడ్డి కోరారు.  ఈ కార్యక్రమంలో నల్గొండ  డీసీసీ  అధ్యక్షుడు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రజకులకు అండగా ఉంటాం 

రజకులకు కాంగ్రెస్​ అండగా ఉంటుందని ఉత్తమ్​హామీ ఇచ్చారు. హూజూర్​నగర్ లోని క్యాంపు కార్యాలయంలో రజక సంఘం జాతీయ కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్​ కుమార్, సంఘం నాయకులు తమ సమస్యలపై మంత్రికి   వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికల తర్వాత రజకుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉత్తమ్​ భరోసా ఇచ్చారు. రజకులు ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.