ఒక్క వానకే వరంగల్ మళ్లీ వణికింది

  • నీట మునిగిన 20 కాలనీలు..  భయంభయంగా జనం
  • ఎక్కడ చూసినా గత ఏడాది వరదల నాటి  సీన్​లే 
  • సమస్యలు రాకుండా చూస్తామని నిరుడు కేటీఆర్​ హామీ
  • నాలాల విస్తరణ చేపట్టలే..రిటైనింగ్‍ వాల్​ కట్టలే
  • పరిశీలనలు, రివ్యూలు, శంకుస్థాపనలకే  పరిమితం 

వరంగల్‍రూరల్‍, వెలుగు: ఒక్క వానకే వరంగల్​ సిటీ వణికిపోయింది. జనం భయం భయంగా గడపాల్సి వచ్చింది. బుధవారం మబ్బుల మూడు గంటలకు  చిన్నగా మొదలైన వాన  పావుగంటకే హోరువానగా మారింది. చాలాచోట్ల కరెంట్​ పోయింది.  డ్రైనేజీలు ఉప్పొంగాయి. జనం నిద్ర నుంచి లేచే సరికే రోడ్లన్నీ  చెరువుల్లా మారాయి. స్లమ్  ఏరియాల్లోని ఇండ్లల్లోకి వరద నీరు భారీగా చేరింది. ఉప్పు, పప్పు, నోటికాడి బువ్వ నీళ్ల పాలైంది. ఇండ్ల ముందు పార్క్​ చేసిన వెహికల్స్​ కొట్టుకుపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. బుధవారం కురిసిన మూడు గంటల వానకే గతేడాది వణికించిన వానలు, వరదల దృశ్యాలు మళ్లీ వరంగల్​లో కనిపించాయి. నాడు మున్సిపల్‌‌ మంత్రి కేటీఆర్‍  వరంగల్​ పర్యటనలో నాలా ఆక్రమణల తొలగింపు విషయంలో ఇచ్చిన హామీలు మాత్రం నేటికీ నెరవేరలేదు. వానకాలంలో ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్పిన మాటలు ఉత్తవే అయ్యాయి.

కేటీఆర్‍ పెట్టిన గడువు.. పోయిన దసరా.. 

గతేడాది జులై, ఆగస్ట్ నెలల్లో కురిసిన వానలు, వరదలు వరంగల్​ సిటీని ఆగం చేశాయి. 128  కాలనీలు నీటమునిగాయి. ఇండ్లల్లో తినడానికి తిండిలేక, వరదనీటితో బయటకెళ్లడానికి రోడ్లు కనపడక జనాలు వారం పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్‍  ఆగస్టు 18న గ్రేటర్​ వరంగల్‍ సందర్శనకు వచ్చారు. హన్మకొండ నయీంనగర్‍, వరంగల్‍, హంటర్​ రోడ్డు ఏరియాల్లో పర్యటించారు. రివ్యూ నిర్వహించారు. నాలాల ఆక్రమణ కారణంగానే సిటీ మునిగిందని తేల్చిచెప్పారు. 15 రోజుల్లో అక్రమ కట్డడాలు తొలగించి రిటైనింగ్​ వాల్​  నిర్మించాలని ఆర్డర్​ వేశారు.  అర్బన్​ కలెక్టర్ రాజీవ్‍గాంధీ హనుమంతు చైర్మన్‍గా టాస్క్​ఫోర్స్ టీం ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పొలిటికల్‍ ప్రెజర్‍ ఉండదని మాటిచ్చారు. పరిశీలన, మార్కింగ్‍, నోటిసులు, కూల్చివేతలకు దసరా పండుగ గడువు పెట్టారు. 

అక్రమ కట్టడాలు, పరిహారంపై నో క్లారిటీ

నాలాల విస్తరణ, అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపులో చెల్లించాల్సిన పరిహారం గురించి ఆఫీసర్లకు క్లారిటీ మిస్సయింది. ఇంటికి సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నా నాలాకు అడ్డుగా ఉందనే కారణంతో తొలగించాల్సినవి ఎన్ని అనే దాంట్లో వారికి స్పష్టత రాలేదు. అలాంటి వారికి పరిహారంగా ఏమిస్తున్నారో బాధితులకు వివరించలేదు. కేవలం నోటీసులిచ్చి కూల్చివేతలు స్టార్ట్​ చేశారు. ఇదే నాడు సమస్యకు కారణమైంది. వానాకాలంలో ఎక్కువ సమస్య ఉండే హన్మకొండ జవహర్‍కాలనీ, వెంకటేశ్వర కాలనీ వంటి ఏరియాల్లో బాధితులు రోడ్డెక్కారు. తమవి అక్రమ కట్టడాలు కావని వాదించారు. ఆపై కాలనీవాసులు ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడారు. ఏమైందో ఏమో తెలియదు కాని ఆఫీసర్లు పనులు ఆపేశారు.

లీడర్ల సపోర్టుతో కేసులు వేయించిన్రు!

నాలాలపై నిర్మాణాల తొలగింపు విషయంలో  కేటీఆర్​ రివ్యూ చేపట్టి ఆఫీసర్లకు కొన్ని సూచనలు చేశారు. ఫ్యూచర్‍ అవసరాలకు అనుగుణంగా నాలా 100  ఫీట్లు ఉండేలా చూడాలన్నారు. అక్రమ కట్టడం ఉంటే తొలగించాలని, అందులో పేదలుంటే డబుల్‍  బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్నారు. అక్రమ కట్టడం కాకుంటే పరిహారం చెల్లించాలని చెప్పారు. అధికారులు మొత్తం 400 వరకు నిర్మాణాలు నాలాకు అడ్డుగా ఉన్నట్లు గుర్తించామని వివరించారు. స్పెషల్​ డ్రైవ్​ చేపట్టి 282 కట్టడాలు తొలగించామన్నారు. అదేటైంలో 84 మంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‍, ఆఫీసర్ల రివ్యూల్లో కొందరు లీడర్లు కూల్చివేతలకు అనుకూలంగా మాట్లాడుతూనే.. మరోవైపు ఆక్రమణదారులతో కేసులు వేయించినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ప్రభుత్వం తరఫున ఓ సీనియర్​ అడ్వకేట్‍ను పెట్టామని, అడ్డుగా ఉన్న ప్రతి నిర్మాణాన్ని త్వరలోనే  కూల్చేస్తామని కలెక్టర్​ చెప్పారు.  బఫర్‍ జోన్‍ ఆధారంగా రిటర్నింగ్‍ వాల్‍ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

ఎలక్షన్‍ పేరుతో అడ్డం దిడ్డం పనులు 

గత ఏడాది వానకాలంలో వరంగల్​ సిటీ  నీటమునగడానికి నాలాపై అక్రమ కట్టడాలే కారణమని మాట్లాడిన మంత్రి కేటీఆర్‍.. దసరా పండుగ నాటికి వాటిని కూల్చివేసి రిటర్నింగ్​ వాల్‍  నిర్మించాలని చెప్పారు. తీరా.. తొమ్మిది నెలల తర్వాత గ్రేటర్​ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరంగల్​ పర్యటనకు వచ్చిన సందర్భంగా సమ్మయ్యనగర్​ వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాది నుంచి ఈ పనులు ఎక్కడ మొదలు పెట్టారో.. ఎక్కడ నడుస్తున్నాయో.. ఎవ్వరికి తెలియని పరిస్థితి. వానలు పడే క్రమంలో వరదనీరు ప్రవహించే స్టార్టింగ్​ పాయింట్​ నుంచి పనులు చేస్తే కొంత ప్రయోజనం కనిపించేది. దీనికి భిన్నంగా వర్క్స్​ చేస్తుండటంతో ఈ ఏడాది కూడా  దాదాపు 25 కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఏటా వానాకాలం వస్తుందనే ముందే కార్పొరేషన్​ ఆధ్వర్యంలో గ్యాంగ్​ వర్క్ ఏర్పాటు చేసి నాలాల వెడల్పు, పూడికతీత పనులు చేపట్టేవారు. ప్రస్తుతం ఆ తరహా పనులు చేయకపోవడంతో జరగాల్సిన నష్టం జరుగుతోంది.

లీడర్లు చెప్పినా పనులేమీ చేయలే

వరంగల్​ సిటీలో పోయినేడాది వానలు వరదలొచ్చి మా కాలనీ అంతా మునిగింది. ఇండ్లల్లోకి నీరొచ్చి వస్తువులన్నీ ఖరాబైనయ్​.  ఆ టైంలో పెద్ద లీడర్లు, ఆఫీసర్లు మా కాలనీలకు వచ్చిన్రు. నెల, రెండు నెలల్లో నాలాలు వెడల్పు చేస్తమన్నరు. అక్రమ కట్టడాలు కూల్చేసి  ఇరువైపులా గోడ కట్టిస్తమన్నరు. మళ్లీ అలాంటి సమస్య రాకుండా చూస్తమన్నరు. కానీ..అవేమీ నిజం కాలేదు. 
- కల్లెం మనోహర్‍, సమ్మయ్యనగర్‍, హన్మకొండ

చిన్నవానకే ఇంట్లోకి నీల్లొచ్చినయ్‍

బుధవారం కురిసిన చిన్నపాటి వానకే గత ఏడాది మాదిరిగా ఇండ్లల్లోకి వరద నీరొచ్చింది. రాత్రి టైం కావడం, కరెంట్​ పోవడంతో ఎక్కడేమి జరుగుతుందో అర్థంకాలేదు. పోయినేడాది ఇట్లనే ఇబ్బందులు వచ్చినయ్‍. దానిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందే పెద్దపెద్ద మోరీలు క్లీన్​ చేస్తే బాగుండేది. నాలాలు కూడా ఇంకా వెడల్పు కాలేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. అసలు సీజన్‍లో ఎట్ల ఉంటుందోననే భయమేస్తున్నది. 
- గడ్డం సుధారాణి, కస్తూరి నగర్‍, వరంగల్‍

మూడుగంటల్లో 20 కాలనీలు మునక

బుధవారం తెల్లవారుజామున హన్మకొండలో 146.7 మి.మీ, హసన్​పర్తిలో 125.2, ఖిలా వరంగల్​లో 112.3, కాజీపేటలో 103.3, వరంగల్​లో 94 మిల్లీమీటర్ల  వర్షం పడింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో మొత్తం138 లోతట్టు ప్రాంతాలుండగా,  దాదాపు 25 కాలనీల్లోకి నీళ్లు చేరాయి.  హన్మకొండలో గోకుల్​ నగర్​, వికాస్​ నగర్​, శ్రీనివాస కాలనీ, సమ్మయ్యనగర్​, గోపాలపూర్, విజయనగర్​ కాలనీ, భవానీ నగర్​, హౌసింగ్​ బోర్డు కాలనీ, అమరావతినగర్​, పోచమ్మకుంట, సగరకాలనీ తదితర కాలనీలు జలమయమయ్యాయి. ఇక వరంగల్​లో ఎస్సార్​ నగర్​, సాయిగణేశ్​ కాలనీ, శివనగర్​, లక్ష్మీనగర్​, శాంతినగర్​, శాకరాసికుంట, కాశీకుంట, రామన్నపేట, ఎన్టీఆర్​నగర్​తో పాటు ఇంకొన్ని కాలనీల్లోకి నీళ్లు చేరాయి. ఇక కాజీపేటలో డీజిల్​ కాలనీ, బాపూజీనగర్​, సోమిడిరోడ్డు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. హన్మకొండ ఎమ్మార్వో ఆఫీస్​ లోకి వరద నీరు చేరి, కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.