హైదరాబాద్లో ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ. 20 కోట్లు టోకరా..

హైదరాబాద్లో ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ. 20 కోట్లు టోకరా..

హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.  చింతల్ శ్రీ సాయి కాలనీలో  నివాసముండే సీతారామయ్య, అతనికి వరుసకు అల్లుడు అయిన మురళీ చిట్టీల పేరుతో దాదాపు 200 మంది దగ్గర నుంచి సుమారు  రూ. 20కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి పరారయ్యారు.

చింతల్ లోని  ఇంటికి వచ్చి చూసే సరికి సీతారామయ్య పరారయ్యాడని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. గత కొద్ది నెలలుగా చిట్టీలు వేసి, తమ డబ్బులు తిరిగి ఇస్తామంటూ నమ్మబలికి, తీరా సమయం వచ్చాక కుటుంబం అంతా డబ్బులతో పరారయ్యారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము మోసపోయామని గ్రహించిన బాదితులు తమ డబ్బు ఇప్పించాలని  సైబరాబాద్ EOW (ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్)  లో ఫిర్యాదు చేశారు.

రోజు వారీ కూలీ పని చేసి రూపాయి రూపాయి పోగు చేసుకుని చిట్టీలు కట్టామని,ఇప్పుడు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా సీతారామయ్య ..అతని అల్లుడు పారిపోయారన్నారు.  బాధితులంతా సీతారామయ్య ఇంటి ముందు ధర్నాకు దిగారు.