లాహోర్ : పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పిడుగు పాటు, వర్షాల కారణంగా మొత్తం 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారం నుంచి గ్యాప్ లేకుండా వాన పడ్తున్నది. జూన్ 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పాకిస్తాన్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని నరోవల్, షేఖ్‌పురా, నన్‌కానా సాహిబ్ నగరాల్లో పిడుగుపాటుకు 8 మంది చనిపోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు.
నరోవల్‌లో భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. లాహోర్, షేక్‌పురా, పస్రూర్, సియాల్‌కోట్ లో వర్షాల కారణంగా కరెంట్ షాక్‌కు గురై ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఒక పోలీసు కూడా ఉన్నాడు. మొత్తం 10 మంది గాయపడ్డారు. వారిని ట్రీట్మెంట్ కోసం లోకల్ హాస్పిటల్‌కు తరలించారు.