పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని డైమర్ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు కొండపై నుండి పడిపోవడంతో 20 మంది మరణించారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు పాకిస్థాన్‌లోని రావల్పిండి నుంచి పీఓకేలోని గిల్గిట్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సు మలుపు తీసుకుంటుండగా ఓవర్‌స్పీడ్‌తో ప్రమాదానికి గురైందని అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని, మరణించిన వారిని చిలాస్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ సీఎం హాజీ గుల్బర్ ఖాన్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.