
గండిపేట్, వెలుగు: రూ.20 లక్షల దారి దోపిడీ కేసును మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ శ్రీనివాస్ తన ఆఫీస్‌లో శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. రాఘవేంద్ర కాలనీకి చెందిన జితేందర్ బజాజ్ ఎస్‌ఆర్‌ఎం ప్రొడక్ట్స్ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు.
ఈ నెల 4న బ్యాంకు నుంచి రూ.20 లక్షల డబ్బులు విత్‌డ్రా చేసి వస్తున్నాడు. ఈ సమయంలో నలుగురు నిందితులు కారులో వచ్చి జితేందర్ బజాజ్ బైక్‌ను ఢీకొట్టారు. అనంతరం అతడిని బెదిరించి రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడు వెంటనే మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఇంతకు ముందు జితేందర్ బజాజ్ వద్ద పని చేసిన సచిన్ స్వామి, ప్రస్తుతం పని చేస్తున్న ప్రశాంత్, సీతారాం, హేమంత్ శర్మ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. దారి దోపిడి చేసిన తర్వాత నిందితులు ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర నుంచి రాజస్థాన్‌కు పరారైనట్లు సమాచారం సేకరించారు.
రాజస్థాన్‌లో ముగ్గురు నిందితులు సచిన్, సీతారాం, హేమంత్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.18 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మక్సూద్ అలీ, ఎస్ఐ ప్రవీణ్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, రాజారావును డీసీపీ అభినందించి, రివార్డులు అందజేశారు.