
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ప్రమాదం
కొడిమ్యాల, వెలుగు : ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగాధర శివారు నమిలికొండ రైల్వే గేట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
నిర్మల్ జిల్లాలోని పలు పోలింగ్ బూత్‌లలో పనిచేసిన ఎలక్షన్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లను తీసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో కరీంనగర్‌లోని సెంటర్‌కు వచ్చారు. బాక్స్‌లను ఆఫీసర్లకు అప్పగించిన అనంతరం తిరిగి అవే బస్సుల్లో నిర్మల్ వెళ్తున్నారు. ఈ క్రమంలో నమిలికొండ రైల్వే గేట్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న బస్సును వెనుకాల వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. ఈ బస్సు డ్రైవర్‌తో సహా 20 మంది ఎలక్షన్ సిబ్బందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కొడిమ్యాల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌కు తరలించారు.