నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చందూర్ శివారులో ఓ డీసీఎం బోల్తా పడి 20 మందికి గాయాలు అయ్యాయి. మే 11వ తేదీ గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జగిత్యాల జిల్లాలోని రుద్రాంగి మండలం మానాల గ్రామానికి చెందిన ముదిరాజు సాయిలు అనే వ్యక్తి.. బడా పహాడ్ లో దేవుని మొక్కులు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి డీసీఎంలో వెళ్తుండగా మార్గం మధ్యంలో డీసీఎం బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో 20 మంది గాయపడగా.. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని 108 వాహనాల్లో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.