కల్లంలో మొలకెత్తిన 20 క్వింటాళ్ల వడ్లు.. బెంగతో కౌలు రైతు మృతి

వీణవంక, వెలుగు : వీణవంక మండలం చల్లూరులో తన వడ్లు వర్షానికి తడిసి మొలకలొచ్చాయని తీవ్ర మనోవేదనకు గురైన ఓ కౌలు రైతు మంగళవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చల్లూరుకు చెందిన బొంగోని సదానందం(40) మూడున్నర ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేశాడు. ఇటీవల అకాల వర్షాలకు వడ్లు తడిచిపోయాయి. ట్రాక్టర్ కొనడానికి, కౌలు, సాగు పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.6 లక్షల వరకు పేరుకుపోయాయి. వీటిని తీర్చేదెలా అని కుటుంబసభ్యులతో, ఇరుగుపొరుగుతో చెప్పుకుని బాధపడ్డాడు.

పది  రోజుల కింద కల్లంలో కూర్చుని మొలకెత్తిన వడ్లను చూపిస్తూ తన ఆవేదన వెళ్లగక్కాడు. ఆ వీడియో బుధవారం బయటకు వచ్చింది. అందులో  ‘అయ్యా ట్రిప్పున్నర వడ్లు మొలకలొచ్చి పోయినయ్. రూ.30, 40 వేలు లాస్ అయిన. నేను ఒక కౌలు రైతును. నాకు ఎవరూ ఒక్క రూపాయి కట్టించడానికి లేరు. నా పరిస్థితి ఎట్లా? కేసీఆర్ గారు మమ్మల్ని పట్టించుకుంటరో.. పట్టించుకోరో అర్థమైతలేదు. మందు డబ్బాతాగి సచ్చిపోవుడా.. ఇదే పొలంల ఉరేసుకుని సచ్చిపోవుడా అర్థమైతలేదు.

ఎక్కడ జాగల్లేవ్. ఏం లేవ్. మేం రోడ్ల మీద పోసుకుంటే పోలీసోళ్లు వద్దంటుండ్లు. మా బతుకులు ఎట్లా తెల్లారేదే. ఎట్లా కొసల్లేది. మమ్మల్ని ఎవరు ఆదుకోవాలె’ అంటూ ఏడుస్తూ మాట్లాడాడు.  సదానందం షుగర్​పేషంట్​ కూడా కావడంతో టెన్షన్ తో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడిని సోమవారం కరీంనగర్ జిల్లా హాస్పిటల్ కు తరలించగా..చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య సుజాత, కొడుకు అయ్యప్ప, బిడ్డ లక్ష్మి ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.