- రైతులకు నష్టం జరిగినా చర్యలు తీసుకోలేని పరిస్థితి
- పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీలు
- ఆర్గనైజర్లతో కుమ్మక్కై మోసాలకు తెరలేపుతున్న ఓనర్లు
గద్వాల, వెలుగు: పుట్టగొడుగుల్లా సీడ్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఫౌండేషన్ సీడ్ రైతులకు అంటగట్టిన ఓనర్లు ఇంతే పంట పండించాలని స్లాబ్ విధించడం చర్చనీయాంశంగా మారుతోంది. రైతులను సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు మోసం చేసినా.. పండించిన సీడ్ తీసుకోకపోయినా, దిగుబడి సరిగా రాకపోయినా ఆర్గనైజర్లు, సీడ్ కంపెనీలపైనా ఎవరూ చర్యలు తీసుకోవాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.
ఆర్గనైజర్లు కంపెనీలు పెట్టేశారు..
గద్వాల జిల్లాలో 40 వేల ఎకరాల్లో సీడ్ పంట సాగు చేస్తున్నారు. రైతులు కుటీర పరిశ్రమగా సీడ్ పంట సాగును ఎంచుకుంటున్నారు. ప్రతీ రైతు తన పొలంలో కొంత సీడ్ పంట సాగు చేస్తున్నారు. దీనిని ఆసరా చేసుకుంటున్న కొందరు ఆర్గనైజర్లు తామే సొంతంగా సీడ్ కంపెనీలు పెట్టేసి రైతులకు ఫౌండేషన్ సీడ్ తో పాటు సొంత కంపెనీ సీడ్ అంటగట్టి మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గద్వాల నియోజకవర్గంలో 8 మంది ఆర్గనైజర్లు కలిసి నాలుగు సీడ్ కంపెనీలు పెట్టి రైతులకు విత్తనాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. డిమాండ్ ఉన్నప్పుడు రైతుల నుంచి విత్తనాలు తీసుకుంటున్న ఆర్గనైజర్లు.. డిమాండ్ లేనప్పుడు ఫెయిల్ అయ్యాయని చెబుతూ రైతులను నిండా ముంచుతున్నారు.
విచిత్రమైన పేర్లతో కంపెనీలు..
విచిత్రమైన పేర్లతో సీడ్ కంపెనీలు నడిగడ్డలో చలామణి అవుతున్నాయి. మై సీడ్, ఆర్ సీడ్, రాయల సీడ్, జనని, వసంత, డీకోడ్, కోహినూరు పేర్లతో రైతులకు సీడ్ అంటగడుతున్నారు. అవి ఫెయిల్ అయితే ఎవరిని అడగాలో అర్థం కావడం లేదని, ఇలాంటి కంపెనీలకు ఆఫీసులు కూడా లేవని రైతులు వాపోతున్నారు. సీడ్ ఆర్గనైజర్లు తమ విత్తనాలను రైతులకు అంటగడుతూ పెద్ద కంపెనీలను కూడా బురిడీ కొట్టించే స్థాయికి ఎదిగారు. ఇలా రూ.కోట్లలో బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఆర్గనైజర్లతో కంపెనీల కుమ్మక్కు..
కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకోకుండా, సీడ్ ఆర్గనైజర్లతో అగ్రిమెంట్ చేసుకుని రైతులను నిండా ముంచుతున్నారనే విమర్శలున్నాయి. సీడ్ ఫెయిల్ అయినా, పంట దిగుబడి రాకపోయినా రైతుకు, కంపెనీకి మధ్య అగ్రిమెంట్ లేకపోవడం వల్ల కంపెనీల నుంచి ఎలాంటి పరిహారం రావడం లేదు. కంపెనీ, రైతు మధ్య అగ్రిమెంట్ జరిగితే రైతు నష్టపోయినప్పుడు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.
దీంతో సీడ్ కంపెనీలు ఆర్గనైజర్లతో అగ్రిమెంట్ చేసుకొని, రైతులకు నష్టం చేస్తున్నారు. ఇటీవల వసంత, స్టెరాయిల్ కంపెనీ సీడ్ వేసి నష్టపోయిన రైతులకు పరిహారం రాకపోవడానికి అగ్రిమెంట్ లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కనీసం ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని పరిశీలించడానికి కూడా ఎవరూ రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వారు చెప్పిందే ఫైనల్..
సీడ్ వ్యవస్థలో రైతుల పాత్ర ఏమాత్రం ఉండదు. కంపెనీలు, ఆర్గనైజర్ చెప్పిందే వేదంలా కొనసాగుతోంది. కష్టపడి పండించిన పంటను పరిశీలించి కంపెనీలు ఫెయిల్ అని చెబితే ఒక్క రూపాయి కూడా రైతుకు రాదు. ఫెయిల్ అయిన విత్తనాలను కూడా రైతులకు ఇవ్వరు. ఎకరా పంట సాగు చేస్తే 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రైతుకు మిగులుతాయి. ఫెయిల్ అయితే రూ.3 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఫెయిల్ అయిన విత్తనాలను రీ జర్మినేషన్ చేయించాల్సి ఉన్నా, దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా కంపెనీలు, ఆర్గనైజర్లు కలిసి రైతులను ముంచుతున్నారు.
పర్యవేక్షణ లేకపోవడంతో..
కంపెనీలపై అగ్రికల్చర్ ఆఫీసర్లు, ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో కొన్ని కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కొన్ని కంపెనీలు ఎకరాకు ఇన్ని క్వింటాళ్లే పండించాలని, ఎక్కువ పండిస్తే తాము తీసుకోమని చెబుతున్నారు. దీంతో ఆ కంపెనీ సీడ్ వేసిన రైతులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎంత దిగుబడి వస్తే అంత డబ్బులు వస్తాయని ఆశతో కష్టపడుతున్న రైతులకు ఈ నిబంధనతో నష్టపోవాల్సి వస్తోంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం..
సీడ్ కంపెనీలపై మాకు పర్యవేక్షణ ఉండదు. పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న సీడ్ కంపెనీలపై చర్యలు తీసుకునే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటాం.
గోవింద్‌నాయక్, డీఏవో, గద్వాల