దుర్మార్గులు కుక్కలను చంపారు. అర్థరాత్రి కారులో వచ్చి ఊర్లోని వీధులన్నీ తిరుగుతూ కనిపించిన కుక్కలపై కాల్పులు జరిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో కుక్కలను కాల్చిచంపారు దుండగులు. రాత్రి రెండు గంటల సమయంలో కొందరు దుండగులు స్విప్ట్ కారులో గ్రామంలోకి వచ్చి కనబడిన కుక్కలపై కాల్పులు జరిపారు. ఘటనలో దాదాపు 20 కుక్కులు చనిపోగా.. మరికొన్ని గాయపడ్డాయి. కాల్పుల శబ్ధంతో గ్రామస్తులు బయటకు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు.
గ్రామస్తులు వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో ఉన్న కుక్కల పక్కన బుల్లెట్లు పడి ఉన్నాయి. అసలు కుక్కలను ఎందుకు..ఎవరు చంపారనేది తెలియాల్సి ఉంది. కుక్కలను తుపాకితో చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.