
- తిరుపతి రుయాలో అంబులెన్స్ డ్రైవర్ల దారుణం
- 20 వేల డిమాండ్, టూవీలర్ పై డెడ్ బాడీ తరలింపు
తిరుపతి: స్థానిక రుయా ఆసుపత్రి దగ్గర దారుణం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఓ బాలుడు ఇవాళ ఉదయం చనిపోయాడు. బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు అంబులెన్స్ మాట్లాడి రుయాకు పంపారు. ఐతే ఆ అంబులెన్సును రుయా హాస్పిటల్ దగ్గరున్న కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు అడ్డుకున్నారు. తమ అంబులెన్స్ లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలని పట్టుబడ్డారు. చేసేదేమీలేక బంధువులు పంపిన ఆంబులెన్స్ వెనక్కి వెళ్లిపోయింది. లోకల్ అంబులెన్స్ కోసం 20వేలు డిమాండ్ చేశారు.
అంత డబ్బు ఇచ్చుకోలేని బాలుడి తండ్రి... డెడ్ బాడీని టూవీలర్ పై సొంతూరు అన్నమయ్య జిల్లా చిట్వేలుకు తీసుకెళ్లారు. రుయా నుంచి చిట్వేలు దాదాపు 90 కిలోమీటర్లు. బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉచితంగా మృతదేహాలను తీసుకెళ్లే.. సర్కార్ మార్చురీ వ్యాన్ మూలనపడటంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై స్పందించిన మంత్రి విడదల రజని
తిరుపతిలోని రూయా ఆసుపత్రి అంబులెన్స్ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. అధికారులను వివరణ కోరడంతోపాటు సమగ్ర విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని ఆమె విచారం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా వ్యవహరించిన ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను ప్రైవేటు వ్యక్తులు బెదిరించారా..? లేక రుయా ఆస్పత్రి సిబ్బందే బెదిరింపులకు పాల్పడ్డారా..? అనే కోణంలో కూడా విచారణ చేపట్టాలని ఆదేశించామని మంత్రి వివరించారు.
త్వరలోనే కొత్త విధానం:
మహాప్రస్థానం అంబులెన్స్‌లు 24 గంటలూ పనిచేసేలా త్వరలోనే ఒక విధానాన్ని తీసుకొస్తామన్నారు మంత్రి విడదల రజని. అలాగే ప్రీపెయిడ్ ట్యాక్సుల విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృతదేహాలను వీలైనంత వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారానే ఉచితంగా తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో మృతుల కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకునేలా చూస్తామన్నారు. ఇకపై అన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
రుయా ఆసుపత్రి ఘటనలో ఆరుగురి అరెస్ట్
అంబులెన్స్ ను అడ్డగించిన కేసులో పోలీసులు ఆగమేఘాల మీద స్పందించారు. ఒకవైపు ప్రభుత్వం నుంచి.. మరోవైపు మీడియా ప్రసారాల్లో వస్తున్న వార్తలతో ఉక్కిరిబిక్కిరైన పోలీసులు అంబులెన్స్ ను అడ్డగించిన ఘటనను సీరియస్ గా తీసుకుని ప్రాథమిక విచారణలో గుర్తించిన 6మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులపై ఐపీసీ 341, 506 ఐపిసి, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీ కృష్ణ మాట్లాడుతూ.. అంబులెన్స్ ను అడ్డగించిన కేసులో తిరుపతి కి చెందిన అంబులెన్స్ డ్రైవర్లు నరసింహులు, క్రిష్ణమూర్తి, దొరైరాజ్, దామోదర్, ప్రభు, శేఖర్ లను అరెస్టు చేశామని చెప్పారు. కేసులో ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఆంబులెన్స్ ధరలను నిర్థేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశిత ధరల కన్నా, ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆంబులెన్స్లను అడ్డుకునే వ్యవహారంలో పదే పదే ఫిర్యాదులు వస్తే వారిపై పిడియాక్ట్ పెడతామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
మెఘా కేసులో ఇంజెంక్షన్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్ట్
6 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు వ్యాక్సిన్
ఈనెల 29వరకు జైలులోనే నవనీత్ కౌర్ దంపతులు
డ్యాన్స్ స్టెప్పులతో అంకుల్ హల్ చల్
జార్ఖండ్ విద్యుత్ సంక్షోభంపై సాక్షి ధోనీ గరం గరం
మళ్లీ ‘మాస్క్ లు’ తప్పనిసరి చేస్తున్న రాష్ట్రాలు