- 40 వేల ఎకరాలకు దొరకని సాగునీరు
- పోతారం లిఫ్ట్ కోసం రైతులు డిమాండ్
పెద్దపల్లి, వెలుగు: పక్కనే గోదారి నది.. దానిపై కాళేశ్వరం ప్రాజెక్టు, మూడు బ్యారేజీలు ఉన్నాయి. అయినా పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లోని టెయిల్ ఎండ్ లోని 20 గ్రామాలకు సాగునీరు అందటం లేదని, దాదాపు 40 వేల ఎకరాల భూమి సాగుకు నోచుకోవడం లేదని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంథని మండలం పోతారం వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు ఎనిమిదేళ్లుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాక ముందే మంథని మండల పరిధిలోని గోదావరి మీద పోతారం వద్ద లిఫ్ట్‌కు అప్పటి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే తెలంగాణ వచ్చాక పోతారం లిఫ్ట్‌ను టీఆర్ఎస్ సర్కార్ పక్కన పెట్టింది.
ఓసీపీల విస్తరణలో కెనాల్స్ ధ్వంసం..
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని పొలాలకు ఎస్సారెస్సీ కెనాల్ ద్వారా 1980 నుంచి నీరు వచ్చేది. ఎస్సారెస్సీ డీ 83 గుండారం కింది ప్రాంతంలో 2007 నుంచి వరి పొలాలకు కాలువ నీరు రావడం లేదు. రామగిరి మండలంలో సింగరేణి సంస్థ ఓసీపీల విస్తరణలో భాగంగా కెనాల్స్ ధ్వంసమైనాయి. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంథని మండలం పోతారం వద్ద లిప్ట్ ఏర్పాటు చేసి సాగునీరందించాలని రైతులు ఆందోళనకు దిగారు. పూర్, చిన్న ఓదాల, రామగిరి మండలంలోని రాజాపూర్, బేగంపేట, సుందిళ్ల, ముస్త్యాల, చంగుండారం రిజర్వాయర్ కింది ప్రాంతమైన మంథని మండలంలోని మంథని, విలోచవరం, మల్లెపల్లి, పోతారం, ఉప్పట్ల, గుంజపడుగ, నాగారం, కన్నాల, సిరిపురం, చిల్లపల్లి, దుబ్బపల్లి, బెస్తపల్లి, పుట్టపాక, నగరంపల్లి, లక్కెపూర్, గాజులపల్లి, గుమ్నూను, మైదుపల్లి, కాకర్లపల్లి, సూరయ్యపల్లి, ఎక్లాస్పూర్, బిట్టుపల్లి, గద్దలపల్లి, గోపాలదనాపూర్, రామయ్యపల్లి, కల్వచర్ల, ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, సీతంపల్లి తదితర గ్రామాల్లో సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందడం లేదు.
లిఫ్టుల కోసం రైతుల పోరాటం..
టీడీపీ హయాం నుంచి గోదావరిపైన ఆరెంద, పోతారం, ఉప్పట్ల వద్ద లిఫ్టులు పెట్టాలని రైతులు పోరాడుతున్నారు. కాళేశ్వరం తలాపున ఉన్నా.. మంథని నియోజకవర్గంలోని 20 గ్రామాలకు సాగు నీరందక నష్టపోతున్నామని ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గుండారం రిజర్వాయర్ నుంచి వచ్చే ఎల్ సిక్స్ కెనాల్ కాలువ ద్వారా సుమారు 40 వేల ఎకరాల పంట పొలాల చివరి ఆయకట్టుకు నీళ్లు వచ్చేవి. రామగిరి మండలం నుంచి వచ్చే ఎల్ సిక్స్ కెనాల్ సింగరేణి విస్తరణలో పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం కొత్తగా మరో ఎల్ సిక్స్ కెనాల్ నిర్మించినా కూడా పూర్తి మరమ్మతులు కాలేదు. దీంతో పొలాలకు నీరు అందడం లేదు.
పోరు బాటకు సిద్ధమవుతున్న రైతులు
పెద్దపల్లి జిల్లాలో సింగరేణి ఓసీపీల ఏర్పాటుతో ఎస్సారెస్పీ కెనాల్స్ ధ్వంసమయ్యాయి. రామగిరి మండలం నుంచి గుండారం రిజర్యాయర్ ద్వారా ఎస్సారెస్పీ కెనాల్స్ నుంచి వేల ఎకరాలకు నీరు అందేది. 2007 నుంచి ఓసీపీల విస్తరణతో గ్రామాలతో పాటు కెనాల్స్ కూడా ధ్వంసమయ్యాయి. సింగరేణి సంస్థ కెనాల్స్ నిర్మించే ప్రయత్నం చేసినా అవి పూర్తి కాకపోగా ప్రణాళికాబద్ధంగా లేకపోవడంతో పనికి రాకుండాపోయాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంథని నియోజకవర్గంలోని గ్రామాలకు నీరందుతుందని ఆశించారు. అయినా నిరాశే ఎదురవడంతో రైతులు మరోసారి పోరుబాటకు సిద్ధమవుతున్నారు. సింగరేణి ఓసీపీల విస్తరణ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి, ఎస్సారెస్సీ కాలువలతో పనిలేకుండా గోదావరిపై నిర్మించిన బ్యారేజీల్లో నుంచి నీరు అందించాలని, దాని కోసం పోతారం వద్ద లిప్ట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.