తీవ్రమైన డైరీ(పాల ఉత్పత్తులు) అలర్జీతో బాధపడుతున్న అన్నా బెల్లిసారియో అనే ఒక యువతి.. పాలతో చేసిన డెజర్ట్‌ను తిన్న తర్వాత విషాదకరంగా తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ఆమె తన ప్రియుడితో కలిసి ఇటలీలోని మిలన్‌లోని వీగన్ బర్గర్ చైన్, ఫ్లవర్ బర్గర్‌ని సందర్శించారు. అక్కడ ఆమెకు తీవ్రమైన డైరీ అలెర్జీ కారణంగా అతను పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆమె లేబుల్‌ని చెక్ చేయడమే కాకుండా, అదనపు సమాచారాన్ని కూడా కోరింది. ఆమెకు పాలతో చేయని పదార్థాలు ఇస్తామని సిబ్బంది హామీ ఇచ్చిన తర్వాతే.. ఆమె డెజర్ట్ తినడానికి ముందుకు కదిలింది. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరా నివేదికల ప్రకారం, రెండు స్పూన్లు తీసుకున్న తర్వాత, ఆమెకు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులయ్యాయి.
ఆమె అస్తమా మందులు, కార్టిసోన్ వంటివి ఉపయోగించినప్పటికీ, ఆమె అనాఫిలాక్టిక్ షాక్‌కు గురైంది. అనంతరం అన్నాను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె పది రోజుల పాటు కోమాలోకి వెళ్లి.. శాన్ రాఫెల్ ఆసుపత్రిలో మరణించింది. అన్నా పుట్టినప్పటి నుండి అలెర్జీతో పోరాడుతోంది. ది మిర్రర్ ప్రకారం, డెజర్ట్‌లో పాల కంటెంట్ ఉన్నట్టు తేలింది. అంతే కాకుండా బెల్లిసారియో ఆర్డర్ చేసిన శాండ్‌విచ్‌లోని మయోనైజ్‌లో కూడా గుడ్డు జాడలు కనిపించాయని తదుపరి విచారణలో వెల్లడైంది.
తిరమిసు అనే పేస్ట్రీ దుకాణాన్ని నడుపుతున్న తల్లి, కుమార్తె.. ఫ్లవర్ బర్గర్‌కు పాయసం సరఫరా చేసే బాధ్యత వహించారు. వారు ప్రస్తుతం అన్నా మరణానికి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. రెండు ఉత్పత్తుల మిశ్రమం జరిగి ఉండవచ్చని అధికారులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత దుకాణ యజమానులపై నిషేధం విధించారు. న్యాయమూర్తి ఈ కేసును అనైతికతకు సంబంధించిన ఆందోళనకరమైన చిత్రంగా అభివర్ణించారు.
డైరీ అలెర్జీ అనేది పాల ఉత్పత్తులను తీసుకున్న తర్వాత శరీరం హానికరంగా స్పందించే పరిస్థితి. అటువంటి సందర్భాలలో శరీరం ఈ ఆహారాలను హానికరమైనదిగా గుర్తిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడటం ప్రారంభిస్తుంది. డైరీ అలర్జీ ఉన్న వ్యక్తులు వికారం, దగ్గు, నోటి చుట్టూ దురద, వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి వివిధ లక్షణాలతో బాధపడవచ్చు. డైరీ అలర్జీలు ఉన్న వ్యక్తులకు ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి ఆహారంలోని పదార్థాలపై సరైన అవగాహన ఉండడం చాలా కీలకం.