- వీ మిస్ యూ ‘పొట్టి’ ( పిల్లి)
- 21 ఏండ్ల పిల్లి మృతితో తల్లడిల్లిన కుటుంబం
- స్థానిక శ్మశానంలో అంత్యక్రియలు
అంబర్‌పేట, వెలుగు: అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లి మృతి చెందడంతో ఓ కుటుంబం తల్లడిల్లింది. 20 ఏండ్లు కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగిన పెంపుడు జంతువు ఇక లేదని తెలిసి కన్నీరుమున్నీరైంది. ఇంటి పెద్దను కోల్పోయినంతలా రోధించింది.
అంబర్‌పేటలోని పటేల్ నగర్ రాజయ్య వీధికి చెందిన జూలూరు చారి, శ్రీదేవి దంపతులు జంతుప్రియులు. 2004 సెప్టెంబర్ 19వ తేదీన పుట్టిన ఓ పిల్లి పిల్లను ఇంటికి తెచ్చుకున్నారు. దానికి ‘పొట్టి’ అనే పేరు పెట్టి కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. యేటా పుట్టిన రోజు వేడుకలు నిర్వస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్19తో పొట్టి 20 ఏండ్లు పూర్తిచేసుకుంది. ఈసారి కూడా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చారి, శ్రీదేవితోపాటు వారి ఇద్దరు పిల్లలు పొట్టిని ఎంతో ముద్దు చేసేవారు. కాగా తీవ్ర అస్వస్థతకు గురైన పొట్టి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు చనిపోవడంతో కుటుంబ సభ్యులంతా బాధలో మునిగిపోయారు. కన్నీటి పర్యంతమవుతూ పొట్టి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్థానిక శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మన దేశంలో పిల్లి సగటు జీవితకాలం 14 నుంచి 15 ఏండ్లు మాత్రమే. అలాంటిది పొట్టి... చారి, శ్రీదేవి దంపతుల పోషణలో 20 ఏండ్లు జాయ్‌ఫుల్‌గా బతికింది.
ఆపద సమయంలో అలర్ట్ చేసేది
‘పొట్టి ఎక్కడపడితే అక్కడ మల, మూత్ర విసర్జన చేసేది కాదు. నేరుగా ఇంట్లోని టాయిలెట్ రూమ్‌కు వెళ్లేది. చేపలు, చికెన్, ఐస్ క్రీమ్ ఇష్టంగా తినేది. చారి సాయంత్రం ఇంటికి ఒట్టి చేతులతో వెళ్తే అరుస్తూ గోల చేసేది. 2011 జూన్ 9న అర్ధరాత్రి శ్రీదేవికి చాతిలో నొప్పి వచ్చి ఇబ్బంది పడుతుండడంతో గమనించి గట్టిగా అరుస్తూ కుటుంబ సభ్యులను అలర్ట్‌చేసింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు శ్రీదేవిని 108లో హైదర్ గూడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు గుండెపోటుగా నిర్ధారించి స్టంట్ వేశారు. అలా యజమాని ప్రాణాలు కాపాడింది పొట్టి.