బాలికపై అత్యాచారం కేసులో .. దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష

కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్  జిల్లా చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామంలో వికలాంగ బాలిక (12) పై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషి పీచు శేఖర్  అలియాస్  శేఖర్ రెడ్డి  (35) కి కరీంనగర్  మొదటి అదనపు జిల్లా సెషన్స్, పోక్సో కోర్టు 20 సంవత్సరాల జైలుశిక్ష, రూ.6 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు జడ్జి శ్రీవాణి బుధవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్  కథనం ప్రకారం చిగురుమామిడి మండలం పీచుపల్లి గ్రామంలో నివాసముంటున్న వికలాంగ బాలిక తల్లిదండ్రులు కూలిపని చేస్తూ జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కూతురు పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో ఇంట్లోనే ఉంటున్నది. 

అదే గ్రామానికి చెందిన, నేరచరిత్ర కలిగిన పీచు శేఖర్ రెడ్డికి ఈ కుటుంబంతో పరిచయం ఉంది. ఈ క్రమంలో వికలాంగ బాలికపై అతని కన్ను పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న మధ్యాహ్నం బాలిక తల్లిదండ్రులుబ్యాంకు పనిపై బయటకు వెళ్లగా బాలిక ఒంటరిగా ఉంది. ఇది గమనించిన శేఖర్  రెడ్డి వారి ఇంట్లోకి ప్రవేశించి బాలికను మాటల్లో పెట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో బ్యాంకు పని ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. ఇంటి తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో అనుమానంవచ్చి మరో ద్వారం గుండా ఇంట్లోకి వెళ్లగా గమనించిన శేఖర్  రెడ్డి పారిపోయాడు.

 ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిగురుమామిడి పోలీసులు శేఖర్ రెడ్డి పై  కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. కేసులో సాక్షులను పబ్లిక్  ప్రాసిక్యూటర్  వింజమూరి వెంకటేశ్వర్లు కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి శ్రీవాణి.. నిందితునికి జైలుశిక్ష, జరిమానా విధించారు.