భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోక్సో కేసులు ఓ వ్యక్తికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మం పట్టణానికి చెందిన బాలిక కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు నాటు వైద్యం ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మంచికంటి నగర్లో నివసిస్తున్న అమ్మమ్మ ఇంట్లో వదిలి వెళ్లారు.
బాలిక అమ్మమ్మ కూలిపనికి వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికను ఇంటి సమీపంలో ఉన్న జవ్వాజి సాంబశివరావు అనే వ్యక్తి ‘టీవీ చూద్దువు రా’ అంటూ 2021 డిసెంబర్ 30న బలవంతంగా తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన అమ్మమ్మకు జరిగిన విషయాన్ని బాలిక చెప్పింది. బాలిక తల్లిదండ్రులను పిలిపించి మరుసటిరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి ఇన్ స్పెక్టర్ సీహెచ్. శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జ్ షీట్ వేశారు.
12 మంది సాక్షుల విచారణ అనంతరం సాంబశివరావుపై నేరం రుజువుకావడంతో 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి పునరావస పరిహారం కింద రూ. 5లక్షలు చెల్లించాలంటూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, ప్రాసిక్యూషన్ నిర్వహించారు. లైజన్ ఆఫీసర్గా ఎం. హరిగోపాల్ వ్యవహరించారు.