వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా మదనాపురం మండలం రామన్ పాడు గ్రామానికి చెందిన ఓ బాలికను అత్యాచారం చేసిన నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, 2 వేల ఫైన్ విధిస్తూ వనపర్తి జిల్లా పోక్సో కోర్టు జడ్జి సునీత బుధవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. నిరుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కార్మికులు జీవనోపాధి కోసం మదనాపురం రామన్ పాడ్ కు వచ్చి శివారులో గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. అందరూ పనులకు వెళ్లగా గుడిసెలో ఒంటరిగా ఉన్న ఓ ఐదేండ్ల బాలికపై పశ్చిమ బెంగాల్ నుంచే వచ్చిన వలస కూలీ మచ్చన్ షేక్ (48) అత్యాచారం చేశాడు.
దీంతో సాయంత్రం బాలికకు రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్లో చేర్పించారు. అసలు విషయం తెలుసుకున్న వారు మదనాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మచ్చన్ షేక్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు. ఈక్రమంలో వనపర్తి పోక్సో కోర్టు మచ్చన్ షేక్ ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. జిల్లా పోక్సో కోర్టులో ఇది మొదటి తీర్పు అని వనపర్తి అడిషనల్జిల్లా కోర్టు పీపీ చంద్రశేఖర్ రావు తెలిపారు. తీర్పుపై స్థానిక మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.