ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కుక్కలతండాకు చెందిన బానోత్ రవి, బానోత్ దుబ్లాకు గంజాయి అక్రమ రవాణా కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. 2019 ఫిబ్రవరి 28న ఖమ్మం-–1 ఎక్సైజ్ సీఐ కొత్తా రాజు, ఎస్ఐలు ఆర్.రాజు, వి.రవి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వై. సర్వేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి ఖమ్మం రైల్వే స్టేషన్ రోడ్ లోని షాదీఖానా సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు నిందితులు 10 కేజీల ఎండు గంజాయిని బైక్పై అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
గంజాయి, బైక్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ పంపించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కొత్తా రాజు దర్యాప్తు పూర్తి చేసి ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వారి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. అధికారులు, సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితులపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా కొత్త వెంకటేశ్వర్ రావు, జి.హరిందర్ రెడ్డి వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుల్ టి. మారేశ్వర్ రావు, లైజన్ ఆఫీసర్గా ఎం. వెంకటేశ్వర్లు, హోంగార్డు ఆయూబ్ సహకరించారు.