ఇబ్రహీంపట్నం, వెలుగు: పోక్సో కేసులో ఓ నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష పడింది. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధిలోని గడ్డమల్లయ్య గూడ గ్రామానికి చెందిన వరికుప్పల మహేశ్.. ఓ మైనర్ బాలికను మభ్య పెట్టి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును విచారించిన ఎల్బీనగర్లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి, 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.25వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 5 లక్షల నష్టపరిహారం అందించారు.
బడంగ్ పేట: మరో కేసులో బాలికపై అత్యాచారయత్నం చేసిన వ్యక్తికి ఎల్బీనగర్ కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. బాలాపూర్ సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మాన్ నగర్ కు చెందిన మహ్మద్ జియాన్ అలియాస్ ఉమర్(23) అదే ప్రాంతానికి చెందిన బాలికను ప్రేమపేరుతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి యత్నించాడు. వెంటనే బాధితురాలు తప్పించుకొని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2020లో జరిగిన ఈ కేసుకు సంబంధించి ఎల్బీనగర్ కోర్టు న్యాయమూర్తి సోమవారం నిందితుడికి మూడేండ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించారు.