- మంచిర్యాల జిల్లా నస్పూర్లో 200 ఎకరాల సర్కారు భూములు అన్యాక్రాంతం
- వెంచర్లు, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్న రియల్టర్లు
- 42, 64, 72, 119 సర్వే నంబర్లలో జాగాలు గాయబ్
- మార్కెట్ రేటు ప్రకారం ఆభూముల విలువ రూ.500 కోట్లపైనే!
- ఆఫీసర్లతో కుమ్మక్కై కబ్జాకు పాల్పడుతున్న లీడర్లు, రియల్టర్లు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త కలెక్టరేట్ చుట్టూ ఉన్న కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి. ఇప్పటికే సర్వే నంబర్లు 42, 64, 52, 72, 119 లో దాదాపు 200 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం కబ్జాకు గురైన భూముల విలువ రూ.500 కోట్ల పైమాటేనని అంచనా. గత కొన్ని సంవత్సరాలుగా లీడర్లు, రియల్టర్లు ఆఫీసర్లతో కుమ్మక్కై యథేచ్చగా భూములు కబ్జా చేశారు.
వాటికి ఫేక్ డాక్యుమెంట్లు, సాదా బైనామాలు, అసైన్మెంట్లు సృష్టించి రియల్ వెంచర్లు చేసి అమ్ముకుంటున్నారు. అందులో టెంపరరీగా షెడ్లు నిర్మించి మున్సిపాలిటీ నుంచి హౌస్ నంబర్లు తీసుకుంటున్నారు. వాటి ఆధారంగా కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. కోర్టు తీర్పు రాకుండానే భూములు అమ్ముకుని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నస్పూర్ శివారులో గతంలో పడావుగా ఉన్న భూమిలో ఐడీఓసీ నిర్మించడంతో ఇటీవల ఆ ప్రాంతంలోని భూములకు విపరీతమైన డిమాండ్ వచ్చింది.
ఈ ప్రాంతంలో గజం రూ.15 వేల నుంచి రూ.50 వేలు ఉండగా, నేషనల్ హైవే 363ను ఆనుకుని ఉన్న భూమి గజం విలువ రూ.లక్ష దాకా ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ప్రాంతంలో సర్వే నంబర్ 42లో 102 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేట్ అవసరాలకు 60 ఎకరాల వరకు కేటాయించారు. మిగతా 40 ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. సర్వే నంబర్ 64లో మొత్తం 197.30 ఎకరాల భూమి ఉంది. ఇందులో 122 ఎకరాలను గతంలో పలువురు పేదలకు అసైన్ చేశారు.
15 ఎకరాలను హౌస్ సైట్ల కోసం కేటాయించారు. వాటితో పాటు మిగిలిన భూమి కూడా అన్యాక్రాంతానికి గురైంది. ఒక రియల్టర్ అసైన్డ్ భూమిలో రియల్ వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముతున్నాడు. సర్వే నంబర్ 72లో ఏకంగా 451 ఎకరాల ల్యాండ్ ఉండగా, ఇందులో సింగరేణి 300 ఎకరాలను తీసుకుంది. పదెకరాలు కేజీబీవీకి, ఆర్టీవో ఆఫీసుకు, 25 ఎకరాలు హౌజ్ సైట్లకు కేటాయించారు. కేజీబీవీతో పాటు మిగిలిన భూమి పరులపాలైంది. సర్వే నంబర్119లో 15.15 ఎకరాలు ఉండగా, 12 ఎకరాలను ముగ్గురికి అసైన్ చేశారు.
విమెన్స్ డిగ్రీ కాలేజీకి కేటాయించిన 2 ఎకరాలను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఇచ్చారు. ఈ భూములన్నీ చేతులు మారుతూ కనుమరగయ్యాయి. స్పూర్ చెరువు శిఖం కింద 144 ఎకరాలు ఉండగా, రియల్టర్లు కొంత భూమిని కబ్జా చేసి తమ వెంచర్లో కలిపేసుకున్నారు.
భూ నిర్వాసితుడి నుంచి కొనుగోలు
ప్రస్తుత నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రాయ్‌పూర్ కాండ్లికి చెందిన ఎస్సారెస్పీ భూ నిర్వాసితుడు సైదుల నర్సయ్యకు సర్వే నంబర్ 42లో 3 ఎకరాలు, 64లో 2 ఎకరాలు, మొత్తం 5 ఎకరాలను 2013లో కేటాయించారు. ఈ భూమిని అమ్మడానికి రూల్స్ ఒప్పుకోకపోయినా బీఆర్ఎస్ లీడర్లు నర్సయ్య నుంచి భూమిని కొనుగోలు చేశారు. నేషనల్ హైవే 363ని ఆనుకుని ఉండడంతో ఇక్కడ గజం ధర రూ.లక్షపైనే ఉంది. అక్రమ కేటాయింపు, అక్రమ అమ్మకాన్ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో కేసు వేశారు. 2016లో కౌంటర్ ఫైల్ చేయాలని హైకోర్టు ఆదేశించినా ఇంత వరకూ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ భూమిని రూ.10 కోట్లకు అమ్మకానికి పెట్టినట్టు సమాచారం.
సర్కారు భూమిని కబ్జా చేసిన రియల్టర్స్
సర్వే నంబర్ 42లో గతంలో క్రీడా మైదానానికి, మెడికల్ హబ్‌కు కేటాయించిన స్థలం ఎదురుగా ఉన్న ఖాళీ జాగాలో అక్రమంగా షెడ్లు వేసి చుట్టూ కాంపౌండ్ కట్టారు. బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ తెలంగాణ భవన్ సమీపంలోని మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్‌కు ఆనుకుని ఉన్న భూమిలో ఓ సంఘం భవనానికి కేటాయించారని చెప్పి నిర్మాణాలు చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్లో ఇన్కమ్ టాక్స్ ఆఫీసుకు కేటాయించిన జాగాను కూడా కొందరు కబ్జా చేసి షెడ్డు నిర్మించారు.
సర్వే నంబర్ 119లో గవర్నమెంట్ ఐటీఐకి కేటాయించిన స్థలంలో కొంత కబ్జా చేశారు. సర్వే నంబర్ 40లో ఓ రియల్టర్ 4 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేశాడు. ఆ పక్కనే ఉన్న సర్వే నంబర్ 42లోని 2 ఎకరాల సర్కారు భూమిని కబ్జా చేశాడు. సర్వే నంబర్ 40 పేరిట కబ్జా భూమిని గుట్టుచప్పుడు కాకుండా ప్లాట్లు చేసి విక్రయించాడు. మరోవైపు నస్పూర్‌లోని తోళ్లవాగును ఆనుకొని ఉన్న సర్వే నంబర్36లో 5.5 ఎకరాల పోరంబోకు భూమి, దాని పక్కనే సర్వే నంబర్ 35లో 9.8 ఎకరాల పట్టా భూమి ఉంది.
ఈ పట్టా భూమిని కొన్నేండ్ల కిందే ప్లాట్లు చేసి అమ్మేశారు. సర్వే నంబర్ 35 డాక్యుమెంట్లతో సర్వే నంబర్36లో భూమిని కూడా అమ్మారు. దగ్గరలోనే ఐడీఓసీ నిర్మించడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ఇండ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి.
అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు
సర్వే నంబర్లు 20, 21 లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఇందులో 42 సర్వే నంబర్ లోని 20 గుంటల సర్కారు జాగాను కలుపుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రెండేండ్లుగా కలెక్టర్‌కు, రెవెన్యూ అధికారులకు పలువురు ఫిర్యాదు చేస్తున్నా స్పందన లేదు. అంతేకాకుండా ఈ వెంచర్ కు రోడ్డు లేకపోవడంతో మిషన్ భగీరథ ట్యాంకు పక్కనుంచి అప్పట్లో రోడ్డు వేశారు. అధికారులు కందకాలు తవ్వగా అదే రోజు దానిని పూడ్చేశారు.
జూన్‌లో సీఎం కేసీఆర్ టూర్ సందర్భంగా ఐడీసీఓ నుంచి బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లడానికి ఇదే వెంచర్ నుంచి 30 ఫీట్ల రోడ్డు వేశారు. పట్టణ ప్రగతి ఫండ్స్ నుంచి రూ.83 లక్షలు ఖర్చు పెట్టి పరోక్షంగా రియల్టర్లకు లాభం చేకూర్చారు. అలాగే ఎన్ హెచ్363 నుంచి ఐడీఓసీకి వెళ్లే రోడ్డులో బీఆర్ఎస్ లీడర్ ఒకరు ఐదంతుస్తుల బంగళా నిర్మించాడు. సర్వే నంబర్ 40 పేరిట సర్వే నంబర్లో 42లో కబ్జా చేసి కట్టేశాడు. ఈ స్థలం చుట్టూ సర్వే నంబర్ 42లో ప్రభుత్వం టీఎన్జీవోలకు కేటాయించిన జాగా ఉంది. దాని మధ్యలో పట్టా భూమి ఎట్లా వచ్చిందన్నది అంతుచిక్కని విషయం.
రాత్రికి రాత్రే కాంపౌండ్ కట్టారు
సర్వే నంబర్ 64లో ఎన్ హెచ్363ని ఆనుకుని ఉన్న సుమారు 20 గుంటల భూమిని కబ్జా చేసి రాత్రికిరాత్రే కాంపౌండ్ నిర్మించారు. నస్పూర్ పోలీస్ స్టేషన్‌కు, పీహెచ్‌సీకి మధ్య ఉన్న ఇక్కడ గజం ధర రూ.50 వేలపైనే ఉంది. ఇందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్థలాన్ని గతంలో ఆటోనగర్ కు, ఆయుర్వేదిక్ హాస్పిటల్కోసం కేటాయించారని, సదరు భూమిని కాపాడాలని స్థానికులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తోళ్లవాగు అవతల కొంతమంది వెంచర్లు చేసి వాగు పూడ్చి రోడ్డు వేశారు. నస్పూర్ గ్రామకంఠంలోని 10 గుంటల జాగాను కబ్జా చేసి మరో వెంచర్‌కు రోడ్డు వేశారు.
కబ్జాదారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తం
నస్పూర్ శివారులోని సర్వే నంబర్లు 42, 64, 52, 119లో ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) సదావత్ మోతీలాల్ స్పందించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసుఅధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను రంగంలోకి దించారు. ఇటీవలే సర్వే నంబర్ 42లోని అక్రమ కట్టడాలను అదనపు కలెక్టర్ మోతీలాల్ దగ్గరుండి జేసీబీతో కూల్చేవేయించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను సీరియస్‌గా తీసుకుంటున్నామని, కబ్జాదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయిస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, అన్యాక్రాంతమైన భూములను సర్వే చేయించి సర్కారు స్వాధీనపరచుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
- అదనపు కలెక్టర్ సదావత్ మోతీలాల్