తవాంగ్: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంటోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహాద్దు వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. భారత, చైనా జవాన్ల మధ్య తోపులాట జరిగింది. వారం రోజుల కింద జరిగిన సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బార్డర్ వద్ద ప్యాట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఎదురు పడ్డ ఇరు దేశాల సైనికులు.. తమ నియంత్రణ రేఖను దాటి వచ్చారంటూ పరస్పరం తోపులాటకు దిగారు. దాదాపు 200 మంది చైనా జవాన్లను భారత సైనికులు అడ్డుకున్నారని సమాచారం. ఇరు దేశాలకు సంబంధించిన కమాండర్ స్థాయి జవాన్ల చర్చలతో గొడవ సద్దుమణిగిందని సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో చైనా జవాన్ల కంటే మన దేశ జవాన్లే ఎక్కువగా ఉన్నారని తెలిసింది.
ఒప్పందానికి కట్టుబడే ఉన్నం
తోపులాటలో ఎవరికీ గాయాలవ్వలేదని భారత సైన్యాధికారులు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలకు తాము కట్టుబడి ఉన్నామని భారత సైన్యం మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ - చైనా సరిహాద్దు దగ్గర ఇంత వరకు అధికారికంగా ఎలాంటి సరిహద్దు రేఖ లేదు. కానీ ఇండో, చైనాలు తమ సరిహద్దు రేఖలను నియంత్రించుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనా.. ఈ ప్రాంతంలో 2011, 2016లో చొరబాట్లకు పాల్పడింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చైనా సరిహద్దు వద్ద భారత్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.