హైడ్రాకు రూ.200 కోట్లు

హైడ్రాకు రూ.200 కోట్లు

 హైదరాబాద్, వెలుగు: విపత్తులు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం ఇటీవల ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు బడ్జెట్లో  రూ.200 కోట్లు కేటాయించారు. మరోవైపు పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణాల అభివృద్ధికి సర్కారు పెద్దపీట వేసింది. స్మార్ట్​ సిటీలు, కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీలకు పెద్దమొత్తంలో ఫండ్స్ కేటాయించింది. 

మొత్తంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్​మెంట్ కింద రూ.15,542 కోట్లు ప్రతిపాదించింది. అందులో రూ.8032 కోట్లు ప్రగతిపద్దు కాగా.. మరో రూ.7,510 కోట్లు నిర్వహణ పద్దుగా చూపింది. స్టేట్​ఫైనాన్స్ కమిషన్​ద్వారా మున్సిపాలిటీలకు అసిస్టెన్స్​ఫండ్​గా రూ.1,380 కోట్లను కేటాయించింది. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ.101 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ.179.29 కోట్లు ఇచ్చారు.

 ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కింద పది లక్షల జనాభా దాటిన సిటీలకు రూ.411 కోట్లు, జనాభా పది లక్షల లోపున్న సిటీలకు రూ.369 కోట్లు ప్రతిపాదించారు. కాగా, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద స్వచ్ఛభారత్ కోసం రూ.226.41 కోట్లను కేటాయించారు. పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్​వెజ్ మార్కెట్లకు రూ.100 కోట్లను చూపారు. నిర్వహణపద్దుల కింద రుణాలు, జీతభత్యాల చెల్లింపుల కోసం రూ.7,510 కోట్లు కేటాయించారు.