జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్ కొంపల్లిలో ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో ఫ్లాట్లు ఇప్పిస్తానని రూ. కోట్లలో వసూలు చేసిన ఓ బిల్డర్ చేతులెత్తేశాడు. బాధితులు తెలిపిన ప్రకారం.. కొంపల్లిలో ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో అపార్టుమెంట్లు కట్టిస్తామని బిల్డర్ శివరామకృష్ణ పలువురి నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. ఒక్కో బాధితుడు రెండు, మూడు ప్లాట్లను బుక్ చేసుకుని రూ. 10 లక్షల నుంచి కోటిన్నర వరకు చెల్లించారు. అయితే దానికి ఫైనాన్షియర్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన సునీల్ కుమార్ అహుజా ఉన్నారు.
కాగా ఫైనాన్షియర్ అహుజా, బిల్డర్ శివరామకృష్ణ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ ప్రాజెక్టు మొత్తాన్ని సునీల్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లలోపు ఫ్లాట్లు కట్టి అప్పగిస్తామన్న శివరామకృష్ణ నాలుగేండ్లు అయినా పూర్తి చేయలేదు. కస్టమర్లకు ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారంతా శివరామకృష్ణను నిలదీశారు. దీంతో తన వద్దకు వచ్చిన కొందరికి చెక్కులు ఇచ్చి పంపించాడు. కాగా ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి. దీంతో కస్టమర్లు బిల్డర్ శివరామకృష్ణను నిలదీశారు. ఆయన ఫైనాన్షియర్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారని చెప్పడంతో ఆదివారం బాధితులంతా ఎమ్మెల్యే కాలనీలోని ఫైనాన్షియర్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు.