- 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లు
- 17,500 జనరల్ కోచ్ ల తయారీ కూడా..
- రైల్వేకు రూ.2.52 లక్షల కోట్లు.. పోయినేడూ అంతే..
న్యూఢిల్లీ: రానున్న రెండు మూడేండ్లలో 200 వందే భారత్ ట్రైన్లను తయారు చేయనున్నట్టు బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ట్రైన్లను కూడా తయారు చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో స్లీపర్ తో పాటు చైర్ కార్ ఉంటాయని పేర్కొంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో రైల్వేకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. ఈసారి రూ.2.52 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ‘‘మొత్తం రూ.4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను బడ్జెట్ లో చేర్చాం.
వీటిని రానున్న నాలుగైదు ఏండ్లలో పూర్తి చేస్తాం. ఇందులో కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు, స్టేషన్ల అభివృద్ధి, ఫైవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం, రైల్వే సేఫ్టీ, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అదే విధంగా 200 వందే భారత్, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లతో పాటు 17,500 జనరల్ కోచ్ ల తయారీ ప్రాజెక్టులూ ఉన్నాయి. జనరల్ కోచ్ ల తయారీ ఇప్పటికే మొదలైంది. మార్చి 31 కల్లా 1,400 కోచ్ ల తయారీ పూర్తవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సవరంలో మొత్తం 2 వేల జనరల్ కోచ్ లను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం” అని వెల్లడించారు.
ఒక్క రూపాయీ పెంచలేదు..
పోయిన బడ్జెట్ లో రైల్వేకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారీ అంతే మొత్తం కేటాయించింది. అయితే బడ్జెట్ లో మొత్తం రూ.2.65 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కింద పేర్కొంది. ఇందులో రూ.2.52 లక్షల కోట్లు జనరల్ రెవెన్యూ నుంచి, ఇతర మార్గాల ద్వారా మిగతా నిధులు సమకూరుతాయని తెలిపింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖకు మొత్తం రూ.3.02 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కాగా, రైల్వే శాఖకు 2024-25 బడ్జెట్లో రూ.2,52,200 కోట్లు, 2023-24లో రూ.2,40,200 కోట్లను కేంద్రం కేటాయించింది.
100% ఎలక్ట్రిఫికేషన్..
కార్గో కెపాసిటీలో రైల్వే శాఖ మరో మైలురాయిని చేరుకోనుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మార్చి 31 కల్లా 1.6 బిలియన్ టన్నుల కార్గో కెపాసిటీ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. అప్పుడు చైనా తర్వాత అతిపెద్ద రైల్వే కార్గో క్యారియర్ గా మన దేశం నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి కల్లా 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తవుతుందని వెల్లడించారు. ‘‘రైల్వేలో సేఫ్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఇందుకోసం ప్రతిఏటా నిధులు పెంచుతున్నాం. దీనికి పోయినేడు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.1.16 లక్షల కోట్లకు పెంచాం” అని తెలిపారు. కాగా, పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) ఇన్వెస్ట్ మెంట్స్ కూడా కలుపుకుంటే రైల్వే బడ్జెట్ మొత్తం రూ.2.65 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు.
ముఖ్యమైన కేటాయింపులు ఇవీ (రూ.కోట్లలో)..
- వ్యాగన్లు, రైళ్ల తయారీ 45,530
- కొత్త రైల్వే లైన్లు 32,235
- డబ్లింగ్ వర్క్స్ 32,000
- సిగ్నలింగ్ అండ్ టెలికాం 6,800
- ఎలక్ట్రిఫికేషన్ 6,150