మినీ మేడారం జాతరకు  200 బస్సులు రెడీ..గ్రేటర్‍ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు 

మినీ మేడారం జాతరకు  200 బస్సులు రెడీ..గ్రేటర్‍ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు 
  • ఈనెల 9 నుంచి16 వరకు స్పెషల్‍ బస్సులు 
  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి ఫ్రీ టిక్కెట్‍
  • ఇతర బస్సుల్లో పెద్దలకు, పిల్లలకు  ఖరారు కాని ధరలు 

వరంగల్‍, వెలుగు: సమ్మక్క సారలమ్మ  మినీ మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు  రెడీ అయ్యారు.  ఈనెల12  నుంచి 15 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తులు భారీగా  తరలివెళ్లే చాన్స్ ఉంది. అందుకు  వరంగల్‍ రీజియన్‍ పరిధిలోని బస్‍ డిపోల నుంచి స్పెషల్‍ సర్వీసులు నడిపేలా ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్‍ వరంగల్‍ లోని హనుమకొండ, వరంగల్‍ –1, వరంగల్‍ – 2 డిపోల నుంచి 200 బస్సులతో 400 ట్రిప్పులు నడిపేందుకు సిద్ధమయ్యారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ఇతర డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  మినీ మేడారం జాతరకు తరలివెళ్లే  మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్‍ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ టిక్కెట్‍ ఇవ్వనున్నారు. అదే సమయంలో వరంగల్‍, హనుమకొండ నుంచి ఇతర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు టిక్కెట్‍ ధరలు ఇంకా నిర్ణయించలేదు.  

గతేడాది  పురుషులకు రూ.250, పిల్లలకు రూ.140 చొప్పున వసూలు చేశారు. ప్రస్తుతం  హనుమకొండ వరంగల్ డిపోల నుంచి మేడారం జాతరకు తీసుకుంటున్న చార్జీలు. పురుషులు ఎక్స్ ప్రెస్  రూ.140 , ఆర్డినరీ 120,  పిల్లలకు ఎక్స్ ప్రెస్ రూ.90, ఆర్డినరీ  రూ.70గా ఉంది.  మినీ మేడారం జాతర సందర్భంగా కూడా  ఇవే చార్జీలు వసూలు చేయాలా.. లేదంటే పెరుగుతాయా అనే దానిపై  ఆర్టీసీ అధికారులు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకొనున్నారు.

24 గంటలు ఆర్టీసీ బస్సులు నడిపిస్తాం

మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఈనెల 9 నుంచి 16 వరకు 200 బస్సులతో 400 ట్రిప్పులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం.  ప్రధాన రోజుల్లో 24 గంటలు బస్సులను నడుపుతాం.  రద్దీ, అవసరం మేరకు ఇతర డిపోల నుంచి అందుబాటులో ఉంచుతాం. మహాలక్ష్మి స్కీమ్ లో ఉచిత సర్వీసులు ఉన్నాయి. ఒక్కో డిపో నుంచి మేనేజర్‍తో పాటు ఇద్దరు కంట్రోలర్లు ఆపరేషన్‍ పర్యవేక్షిస్తారు. వివరాలకు ఎంక్వైరీ  99592 26056 నంబర్‍ ను కూడా అందుబాటులో ఉంచాం. –  డి.విజయభాను, వరంగల్‍ రీజియన్‍ మేనేజర్‍