2000 నోటు ఉపసంహరణ పేదలకు భారం కాదు

ఇటీవల రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ చేసిన ప్రకటన తెలిసిందే. సాదారణంగా ఏ నోట్ల రద్దు వల్ల ఒక్క ప్రభుత్వమే ప్రయోజనం పొందదు. ఒక రకంగా ప్రజలకు కూడా దాని ఫలాలు అందివస్తాయి. 2016లో జరిగిన నోట్ల రద్దు ప్రభావం దేశంలోని సామాజిక, ఆర్ధిక అంశాలను కుడా ప్రభావితం చేసింది. డబ్బు విషయంలో భారతీయుల ఆలోచనా ధోరణిలో పెనుమార్పులు సంభవించాయి. ఇళ్లలో నోట్లను దాచుకుంటూ వచ్చిన ప్రజలు ఇకపై వాటిని బ్యాంకుల్లో దాచుకోవడం మొదలు పెట్టారు. దీని వల్ల బ్యాంకుల క్యాష్ రేషియో ఊపందుకుంది. బ్యాంకుల నికర వడ్డీ ఆదాయ మార్జిన్ లు పెరుగుతాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల పన్నులు కట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి నిధుల రాబడి పెరుగుతుంది. 

అభివృద్ధి పనుల కోసం అప్పులు చేయాల్సిన అగత్యం తగ్గుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 2016 నోట్ల రద్దు ప్రభావం వల్ల నగదు లావాదేవీలు తగ్గి డిజిటల్ లావాదేవీలు పెరిగాయి, కార్డుల ద్వారా చెల్లింపులు బాగా పెరగడం వల్ల వినియోగ వస్తువుల ధరలు కూడా కొంత వరకు తగ్గాయి. నగదు కొరత వల్ల ప్రజలు ప్రత్యామ్నాయ లావాదేవీలపై దృష్టి సారిస్తారు. పేటీఎం, ఫ్రీచార్జ్ లాంటి ఈ-వ్యాలెట్స్ డిమాండ్​ పెరిగింది. వాటితోపాటు ఇ-బ్యాంకింగ్ లాంటి ఆన్ లైన్ లావాదేవీలు, ప్లాస్టిక్ మనీ (డెబిట్, క్రెడిట్ కార్డులు) వాడకం ఎక్కువ అయింది. ప్రస్తుతం ఉపసంహరించుకున్న రూ. 2 వేల నోట్లతో సాధారణ, మధ్య తరగతి ప్రజలకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. నల్ల ధనం నియంత్రణ, నకిలీ నోట్ల నిర్మూలనే లక్షంగా పెట్టుకుని పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు హర్షణీయం.

- డా. కందగట్ల శ్రవణ్ కుమార్