
- కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల్లోనూ లే ఆఫ్స్!
- కరోనా టైమ్‌లో భారీగా రిక్రూట్మెంట్
- ఇప్పుడు ప్రాజెక్టులు లేవంటూ చేతులెత్తేస్తున్న కంపెనీలు
- జాబ్లకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఐటీ ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కత్తి వేలాడుతున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్‌గా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో 3 నెలల్లో 2 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఏఐ వినియోగం పెరగడం, ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రాజెక్టులు లేవంటూ ఎంప్లాయిస్ను పక్కకు పెడుతున్నాయి. గడిచిన 3 నెలల్లోనే హైదరాబాద్‌లో 2 వేల మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ ఇచ్చినట్టు తెలిసింది. కాగ్నిజెంట్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు కూడా సైలెంట్‌గా ఉద్యోగులను బెంచ్ మీద పెట్టాయి. కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. అప్పుడు ఆయా కంపెనీలకు ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే నిరుడి నుంచి పరిస్థితులు క్రమంగా మారుతూ వస్తున్నాయి. ఇక ఏఐ రాక, చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి ఇన్నోవేషన్స్ ఉద్యోగులను మరింత భయపెడుతున్నాయి. రాబోయే ఐదేండ్లలో తమ ఉద్యోగులను పెద్దమొత్తంలో తొలగించనున్నట్టు 41 శాతం కంపెనీలు పేర్కొన్నట్టు వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. ప్రధాన రంగాల్లోకి ఏఐ ప్రవేశించడమే దీనికి కారణంగా వివరించింది. దీంతో ఏ క్షణం ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ‘ప్రాజెక్టులు లేవు.. పనితీరు సరిగ్గా లేదు’ అంటూ వేలాది మందిని పక్కన పెడ్తుండడంతో టెక్ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు.
ఏఐతో తగ్గుతున్న ప్రొడక్షన్ కాస్ట్..
ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. దాదాపు 2 వేల ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో రాష్ట్రమే టాప్‌లో ఉన్నది. నిరుడు 2.7 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. ఈ కారణంగానే బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు పెరిగాయి. అయితే, ఇప్పుడు అదే ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు రాయాల్సిన కోడింగ్‌ను ఏఐ రాసి పెడుతున్నది. దీంతో టెక్ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచుతున్నాయి. తమ ప్రొడక్షన్ కాస్ట్‌ను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంచ్ పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, రానున్న రోజుల్లో దీని వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఐటీ కొలువులే కాకుండా బ్యాంకు ఉద్యోగాలనూ దెబ్బకొట్టనున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. నేషనల్, ఇంటర్నేషనల్ బ్యాంకులు ఏఐ వినియోగాన్ని పెంచుతున్నాయి. బ్యాంకింగ్‌లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 3 శాతం తగ్గొచ్చని బ్లూమ్‌బర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. దీంతో బ్యాక్ ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్‌లో ఉద్యోగాలు చేసేవారికి ముప్పు ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
ఏఐ నేర్చుకోవాల్సిందే.. ఒక పాలసీ తేవాల్సిందే
ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ, రోబోటిక్స్, మెషీన్ లర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్నోళ్లకు ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే చాన్స్ ఉందని చెబుతున్నారు. జావా, డాట్‌నెట్, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం ఉండదని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నైపుణ్యం కూడా ఉండాలని అంటున్నారు. ఏఐ వాడకం పెరుగుతుండడంతో రానున్న మూడేండ్లలో 4 వేల మంది ఉద్యోగులను తగ్గించుకుంటామని నాస్కామ్ ఈవెంట్‌లో డీబీఎస్ గ్రూప్ సీఈవో పీయూష్గుప్తా స్వయంగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆటోమేషన్... ఈ పదం జాబ్ మార్కెట్‌ను వణికిస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ బాట పట్టడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఏఐ స్కిల్స్ ఉండటంతోపాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐ వినియోగంపై ఒక పాలసీ తీసుకురావాలని కోరుతున్నారు. అలా అయితే.. ఉద్యోగాల కోతకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదని ఐటీ ఎంప్లాయిస్ అంటున్నారు. ఏఐ వినియోగం విషయంలో కచ్చితంగా ప్రభుత్వాలు కలుగజేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.