
న్యూఢిల్లీ: ఇండియాలోని అమెరికన్ ఎంబసీ అధికారులు 2 వేలకు పైగా వీసా అప్లికేషన్లను రద్దు చేశారు. మోసపూరిత కార్యకలాపాలతో సంబంధం ఉండటంతో వీటిని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ అపాయింట్‌మెంట్లు అన్నీ ‘బాట్స్’ ద్వారా వచ్చాయని తెలిపారు. అపాయింట్‌మెంట్ వ్యవస్థలో భారీ లోపాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. తమ షెడ్యూలింగ్ విధానాలను ప్రభావితం చేసే ఏజెంట్లు, ఫిక్సర్‌లను సహించేది లేదని హెచ్చరించారు.
అపాయింట్‌మెంట్లను రద్దు చేయడంతో పాటు.. సంబంధిత అకౌంట్లకు షెడ్యూలింగ్ అధికారాలను కూడా సస్పెండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. కాగా, అమెరికాకు బిజినెస్, టూరిజం, బీ1, బీ2, స్టూడెంట్ వీసాలకు అపాయింట్‌మెంట్ల కోసం చాలా టైమ్ వెయిట్ చేయాల్సి వస్తున్నది. కొన్నేండ్లుగా అందరూ ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.
2022–23లో వీసా అపాయింట్‌మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే.. కనీసం 800 నుంచి 1,000 రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉన్నది. 2023లో బీ1, బీ2 అపాయింట్‌మెంట్ల కోసం 999 రోజుల వెయిటింగ్ పీరియడ్ చూపించింది. ఇలా వీసా అప్లికేషన్ల ప్రాసెస్ చాలా లేట్ అవుతున్నదని 2022లో విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా దృష్టికి కూడా తీసుకెళ్లారు. తర్వాత ఈ ఏడాది జనవరిలోనూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు కూడా ఈ సమస్యను వివరించారు.