ప్రకటించిన టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ
టోక్యో: కరోనా కారణంగా ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేయడం వల్ల 2.8 బిలియన్ డాలర్ల (రూ. 20 వేల కోట్లు) వరకూ అదనపు భారం పడుతోందని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జులై–ఆగస్టులో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ కొత్త షెడ్యూల్ ప్రకారం 2021 జులై 23న మొదలవనుంది. ఆర్గనైజర్లు ఎనిమిది నెలల కిందటే వాయిదా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల పడే భారంలో 2/3 వంతుల ఖర్చును టోక్యో, జపాన్ ప్రభుత్వాలు భరిస్తాయి. ప్రైవేట్ నిధులతో నడిచే ఆర్గనైజింగ్ కమిటీ 1/3వ వంతు భరించనుంది. కాగా, ప్రస్తుత ఎక్స్‌ఛేంజ్ రేట్ ప్రకారం వాయిదా వల్ల పెరిగే నిర్వహణ వ్యయాన్ని 1.64 బిలియన్ డాలర్లు (రూ. 12 వేల కోట్లు)గా లెక్కగట్టారు. ఈ భారాన్ని ఆర్గనైజింగ్ కమిటీ, టోక్యో గవర్నమెంట్ సమానంగా పంచుకోనుండగా, నేషనల్ గవర్నమెంట్ కూడా కొంత మొత్తం చెల్లించనుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల కోసమే 920 మిలియన్ డాలర్లు (రూ 6.78 వేల కోట్లు) అవసరం కానుండగా.. ఈ మొత్తాన్ని టోక్యో, జపాన్ ప్రభుత్వాలు పూర్తిగా భరించనున్నాయి. అయితే, కాంటిజెన్సీ ఫండ్ (ఆకస్మిక నిధి) నుంచి 260 మిలియన్ డాలర్లు (రూ. 1900 కోట్లు) వాడుకొని వాయిదా భారాన్ని కొంత తగ్గించుకోవచ్చని ఆర్గనైజింగ్ కమిటీ చెప్పింది. కాగా, ఒలింపిక్స్ కోసం 12.6 బిలియన్ డాలర్లు (రూ. 92 వేల కోట్లు) కేటాయించినట్టు వాయిదాకు ముందే టోక్యో గవర్నమెంట్ ప్రకటించింది. కానీ, దానికి రెట్టింపు ఖర్చు చేయాల్సి ఉంటుందని గతేడాది జరిగిన గవర్నమెంట్ ఆడిట్‌లో వెల్లడైంది.