ఎస్సీ వర్గీకరణ 1997లో అలా.. 2004 వైఎస్ హయాంలో ఇలా

ఎస్సీ వర్గీకరణ 1997లో అలా.. 2004 వైఎస్ హయాంలో ఇలా

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై రెండు నెలలుగా అధ్యయనం చేసిన వన్​మ్యాన్​ కమిషన్  చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్  సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖ కు తన నివేదికను అందజేశారు. అనంతరం ఈ రిపోర్ట్ ను ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబర్లు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్​కు ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అందించారు.  వర్గీకరణ ఖరారుకు  2011 జనాభా లెక్కలను కమిషన్​ పరిగణనలోకి తీసుకున్నది. ఎస్సీలను ఏ, బీ, సీ మూడు గ్రూపులుగా వర్గీకరించాలని రాష్ట్ర  ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది.మాల, మాదిగ, ఇతర ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించి, వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ రిపోర్ట్​లో పేర్కొన్నట్టు సమాచారం. 

వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ 

సుప్రీంకోర్టు 2024 ఆగస్టు1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వగా,  తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11న హైకోర్టు రిటైర్డ్  జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను  వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ గా  నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2 నెలల్లో అధ్యయనం చేసి రిపోర్ట్​ ఇవ్వాలని కోరగా, కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించింది. పార్టీలు, నేతలు, కుల సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో  ఉద్యోగుల  వివరాల తీసుకొని, వర్గీకరణపై రిపోర్ట్ ​సిద్ధం చేసింది.

1997లో వర్గీకరణ ఇలా

జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న  అప్పటి టీడీపీ  ప్రభుత్వం 15 శాతం ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. ‘ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి ఒక శాతం రిజర్వేషన్​ ఇచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక ‘బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉపకులాలు -మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7 శాతం కోటా కేటాయించారు. ‘సీ’లో మాల, దాని ఉపకులాలు - మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6  శాతం కోటా ఇచ్చారు. ‘డీ’లో ఆది ఆంధ్రులతోపాటు మొత్తం 4 కులాలను చేర్చి, ఒక శాతం కోటాగా నిర్ణయించారు. 

వీటిలో ఆనాటికి ఏ, బీ గ్రూపుల కులాలు తక్కువ లబ్ధి పొందాయని, సీ, డీ గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధిని పొందాయని కూడా గుర్తించారు. కాగా, మాల మహానాడు దీనిపై కోర్టుకు వెళ్లింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైందని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం, ఈ వర్గీకరణ చేయడానికి ముందు, ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాల్సి ఉండాల్సిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇదే మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించింది. మొత్తానికి వర్గీకరణ ప్రక్రియకు బ్రేక్​పడింది. 

ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా వర్గీకరిస్తూ, వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు.కానీ 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు  కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్ వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది . దాంతో పంచాయితీ మళ్లీ మొదటికే వచ్చింది.  

2004లో వైఎస్​ హయాంలో 

మాదిగల నుంచి మళ్లీ ఒత్తిడి పెరగడంతో 2004లో వైస్ రాజశేఖర్​రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా.. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్‌‌ను ఏర్పాటు చేసింది. 2008 మేలో మంత్రి మీరాకుమార్‌‌కు కమిషన్ నివేదికను సమర్పించింది. అందులో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటును ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్​ సిఫార్సు చేసింది. కానీ కేంద్రం దీన్ని ఎప్పుడూ సీరియస్‌‌గా తీసుకున్నట్టుగా గానీ, దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్టుగా గానీ ఎలాంటి దాఖలాలు లేవు. 2014 ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ కూడా ఇప్పటికీ హామీగానే ఉండిపోయింది.