
జైపూర్: రాజస్థాన్ లోని జైపూర్‌లో 17 ఏండ్ల కిందట జరిగిన వరుస బాంబు బ్లాస్టుల కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు శిక్ష ఖరారైంది. ఈ మేరకు జైపూర్‌లోని స్పెషల్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ..2008 జైపూర్ వరుస బాంబు బ్లాస్టులను దేశ సార్వభౌమాధికారం, సమగ్రతపై దాడిగా పేర్కొంది. దోషులైన సర్వర్ ఆజ్మీ, షాబాజ్ హుస్సేన్, సైఫుర్ రెహమాన్, మొహమ్మద్ సైఫ్‌లకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు తెలిపింది.
2008 మే 13న జైపూర్‌లోని మానక్ చౌక్ ఖండ, చాంద్‌పోల్ గేట్, బడీ చౌపడ్, చోటీ చౌపడ్, త్రిపోలియా గేట్, జోహ్రీ బజార్, సంగనేరీ గేట్ వద్ద వరుసగా ఎనిమిది బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 71 మంది మరణించగా, 180 మందికి పైగా గాయపడ్డారు. చాంద్‌పోల్ బజార్ సమీపంలో 9వ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ కేసులోనే సర్వర్ ఆజ్మీ, షాబాజ్ హుస్సేన్, సైఫుర్ రెహమాన్, మొహమ్మద్ సైఫ్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించింది.