కరీంనగర్ సిటీ, వెలుగు : వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులపై వెంటనే స్పందించాలని కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారం కోసం 201 దరఖాస్తులు వచ్చాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినవి 17, జిల్లా పంచాయతీ అధికారికి 18, జిల్లా విద్యాశాఖ అధికారికి 10, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారికి 14, పౌర సరఫరాల శాఖ అధికారికి 4, జిల్లా బీసీ సంక్షేమ అధికారికి 5 ఇతర శాఖలకు చెందినవి 133 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. స్వీకరించిన దరఖాస్తులపై అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తనుగుల హరిజన కాలనీవాసులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 169/ఏ లోని 331 గుంటల భూమి కబ్జాచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్, ఎంపీటీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్డీఓ ఆనంద్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో 43 దరఖాస్తులు..
రాజన్న సిరిసిల్ల : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి 43 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 20, ఇతర శాఖలకు సంబంధించి 23 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్పేర్కొన్నారు. ఎక్కువగా పింఛన్, భూ సంబంధిత సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లు బి.సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓలు టి.శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు.