తమిళనాట తెలుగు పరిస్థితి ఏమిటి?

తమిళనాట తెలుగు పరిస్థితి ఏమిటి?

భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశంలో భాషలు అనుసంధానానికి సహాయపడటమే కాకుండా, కొన్నిసార్లు విభేదాలను కూడా సృష్టిస్తాయి.  దీనికి తాజా ఉదాహరణ కొత్త విద్యా విధానం 2020లోని త్రిభాషా సూత్రంపై    తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందీ భాషను వ్యతిరేకిస్తూ దక్షణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేస్తూ హిందీని మాపై బలవంతంగా రుద్దొద్దు అనే నినాదంతో ఉద్యమానికి ఊపిరులు పోస్తున్నారు. 

విద్యలో భాషపై భారతదేశ  త్రిభాషా విధానం 2020 NEP ఎలా ఉంటుంది? ఇది నిజంగా హిందీని రుద్దే ప్రయత్నమా?  కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నామా?  ఈ సృష్టిలోని ఏ వ్యక్తికి అయినా సరే  తన మాతృభాషలో  కనీస
స్థాయి పట్టు ఉండాలి.  తన భాషను ప్రేమించాలి. అభిమానించాలే  తప్ప ఇతర భాషలపై దురభిమానం, వ్యతిరేకత  ఉండకూడదు.  

త్రిభాషా విధానం

జాతీయ విద్యా విధానం2020 ప్రకారం, విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవాలి. అందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. మూడోది అంతర్జాతీయ భాష కావచ్చు. అయితే, ఏ భాషలు నేర్చుకోవాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంది. ఎన్​ఈపీ 2020లో హిందీ తప్పనిసరి కాదు. విద్యార్థులు హిందీ స్థానంలో ఇతర భాషలను కూడా నేర్చుకోవచ్చు. 

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా వర్తిస్తుంది. అన్ని బోధనా సంస్థలు దీనిని అనుసరించాలి.  మూడో భాషగా విద్యార్థులు విదేశీ భాషలు ఇంగ్లీషుతో పాటు కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ వంటి భాషలను నేర్చుకోవచ్చు.

హిందీయేతర పాఠశాలలూ మూతపడ్డాయి

ఎన్​ఈపీ 2020లో భాషా స్వేచ్ఛ హామీగా ఉంది. అయినప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం హిందీపై వ్యతిరేకత కొనసాగిస్తూనే ఉంది. అంతేకాదు, తమిళనాడు భాషా ఆత్మగౌరవం పేరిట 2006 నుండి తమిళాన్ని మాతృభాషగా నిర్బంధ విద్యగా అమలు చేస్తున్నది. దీని ప్రభావం వల్ల తెలుగు, కన్నడ, మలయాళం పాఠశాలలు మూతపడ్డాయి. తమిళనాడులో 1500 పైగా ఉన్న తెలుగు పాఠశాలల్లో 1000 పైగా మూతపడ్డాయి.  తెలుగు పరిశోధనలకు ప్రసిద్ధి గాంచిన మద్రాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి ఆటంకాలు పెరిగాయి. 

ఈ పరిస్థితి చూస్తే, నిజంగా హిందీని బలవంతంగా రుద్దడం అన్యాయం అయితే, అదే విధంగా తమిళాన్ని బలవంతంగా నేర్పించడం కూడా అన్యాయమే కదా?భాషపై విద్యార్థులకు స్వేచ్ఛ భాష ఎప్పటికీ సాంస్కృతిక వారధిగా ఉండాలి, రాజకీయ అస్త్రంగా మారకూడదు. ఉద్యోగ రీత్యా హిందీ నేర్చుకోవడం అవసరమే, భారతదేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరిగేందుకు దోహదం పడుతుంది. భాష అనేది ఒక వంతెనలా పనిచేస్తుంది. త్రిభాషా విధానం ప్రకారం ఏ భాష నేర్చుకోవాలనేది విద్యార్థుల స్వేచ్ఛకు వదిలెయ్యాలి. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయ స్వార్థాలకు బలికావొద్దు. భిన్న భాషలు నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి.
 

హిందీ స్థానంలో తెలుగును అంగీకరించండి 

తెలుగువారు తమిళనాడు రాజకీయాల్లో ప్రభావం చూపే స్థితిలో ఉన్నా, తెలుగును అధికారికంగా గుర్తించే ప్రయత్నం జరగడం లేదు. ద్రావిడ రాజకీయాల్లో తెలుగువారు భాగమవుతుండటమే తప్ప, తమ భాషా, సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటుకోలేకపోతున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో తెలుగువారు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నప్పటికీ, వారిలో సంఘటిత లోపం ఉంది. తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా మంచి నీళ్లు కావాలని కోరుకునే తమిళనాడు, అదే సమయంలో తెలుగు భాషను అణగదొక్కడం తగదు. 

భవిష్యత్తులో ఈ భాషా వివక్ష కొనసాగితే, తమిళనాడుకు నష్టం జరిగే అవకాశముంది. త్రిభాషా విధానం ద్వారా హిందీకి బదులుగా తెలుగును మూడో భాషగా అంగీకరిస్తే, అటు, తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, ఇటూ జాతీయ విద్యా విధానం– 2020 అమలుకు తమిళనాడు సహకరించినట్లవుతుంది. అంతే కాదు ఎన్​ఈపీ–2020 ద్వారా వచ్చే బడ్జెట్ కేటాయింపులు కూడా అందే అవకాశం ఉంది.

- డాక్టర్. 
బి. కేశవులు. 
సోషల్​ యాక్టివిస్ట్​