- దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి
- ఓడిపోయిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందర్ రావు
సిద్దిపేట, వెలుగు : కత్తి పోటుకు గురై దాదాపు 15 రోజుల పాటు దవాఖానలోనే ఉన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థికి సింపతీ కలిసొచ్చింది. మెదక్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఆ సందర్భంగా దౌల్తాబాద్ మండలంలో ఒకరు కత్తితో పొడవడంతో గాయపడి ప్రచారానికి దూరమయ్యారు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ కాగా, ఆయన కుటుంబసభ్యులే కాలికి బలపం కట్టుకుని ఓట్లు అభ్యర్థించారు.
దవాఖాన నుంచే అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేసి వెళ్లిన ప్రభాకర రెడ్డి పోలింగ్ కు కొద్ది రోజుల ముందే కోలుకుని వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్ గెలవగా, ఈసారి కూడా ఆయనే గెలిచే అవకాశం ఉంటుందని అంతా భావించారు. రఘునందన్ కూడా పట్టుదలతో ప్రచారం చేశారు.
ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చాయి. కౌంటింగ్లో కొత్త ప్రభాకర్ రెడ్డికి 97,129 ఓట్లు రాగా రఘునందన్ రావుకు 43,544 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రభాకర్ రెడ్డి ఏకంగా 53,707 ఓట్ల మెజార్టీ సాధించి ఔరా అనిపించారు. ఆయనపై ప్రజలు సానుభూతి చూపడం వల్లే ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయం వ్యక్తమైంది.