భారత బాక్సింగ్ చరిత్రలో మరో మైలురాయిని అందుకోనుంది. త్వరలో భారత్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఢిల్లీ వేదికగా వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ జరగనుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోషియేషన్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై IBA అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్, BFI ప్రెసిడెంట్ అజయ్ సింగ్ సంతకం చేశారు.
మెన్స్ ఈవెంట్ జరగలేదు..
భారత్ ఇప్పటి వరకు రెండు సార్లు మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌ను నిర్వహించింది. తొలిసారిగా 2006 ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ జరిగింది. ఆ తర్వాత 2018లో రెండోసారి ఆతిథ్యమిచ్చింది. 2017లో యూత్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గౌహతిలో జరిగింది. అయితే పురుషుల ఈవెంట్‌కు మాత్రం భారత్ లో ఇప్పటి వరకు జరగలేదు. 2021లో గ్లోబల్ గవర్నింగ్ బాడీకి అవసరమైన రుసుము చెల్లించనందుకు మెన్స్ బాక్సింగ్ ఈవెంట్ ఆతిథ్య హక్కుల నుంచి ఇండియాను తొలగించారు.
నిఖత్ హ్యాపీ...
భారత్ లో ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ జరగనుండటంపై IBA వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. స్వదేశంలో ప్రేక్షకుల ముందు ప్రదర్శన ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపింది. ఇండియాలో ఇంత పెద్ద టోర్నీని నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొంది. ఈ టోర్నీ నిర్వహించడం వల్ల భారత్లో బాక్సింగ్కు మరింత ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే టోర్నీ కౌంట్ డౌన్ ప్రారంభమైందని..వచ్చే ఏడాది ఢిల్లీలో తన టైటిల్ ను కాపాడుకోవడానికి ఎదురుచూస్తున్నానని తెలిపింది.