- వాటి 3డీ స్ట్రక్చర్ ను తెలుసుకునే మార్గం చూపిన మరో ఇద్దరికీ అవార్డు
- అమెరికన్ సైంటిస్టులు డేవిడ్ బకర్, జాన్ జంపర్..బ్రిటన్ సైంటిస్ట్ డెమిస్ హసాబిస్లను వరించిన పురస్కారం
స్టాక్ హోం (స్వీడన్) : కొత్త రకం ప్రొటీన్లను డిజైన్ చేయడంతో పాటు ప్రొటీన్ల స్ట్రక్చర్‌ను ముందే ఊహించేందుకు మార్గం చూపిన ముగ్గురు సైంటిస్టులకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ లభించింది. అమెరికన్ సైంటిస్టులు డేవిడ్ బకర్ (62), జాన్ మైకేల్ జంపర్ (39), బ్రిటిష్ సైంటిస్ట్ డెమిస్ హసాబిస్(48)లను ఈ ఏడాది కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్‌కు ఎంపిక చేసినట్టు బుధవారం స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో నోబెల్ కమిటీ ప్రకటించింది. ‘‘ప్రొటీన్లను జీవుల నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక అణువులుగా చెప్తుంటారు.
ప్రకృతిలో ప్రొటీన్లు కేవలం 20 అమైనో యాసిడ్ల నుంచి మాత్రమే నిర్మాణమవుతాయి. కానీ ఇవి ఒకదానితో ఒకటి కలుస్తూ 3డీ నిర్మాణంతో లెక్కలేనన్ని అత్యంత క్లిష్టమైన ప్రొటీన్లుగా మారుతుంటాయి. అయితే, కెమిస్ట్రీలో ప్రధానంగా బయోకెమిస్ట్రీ రంగంలో ఈ ప్రొటీన్ల డిజైన్, స్ట్రక్చర్ లకు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా అతిపెద్ద సవాళ్లు ఎదురయ్యామయి. ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ముగ్గురి పరిశోధనలు ఎంతో దోహదం చేశాయి. అందుకే ఈ ఏడాది అవార్డును వీరికి ప్రకటిస్తున్నాం”
అని నోబెల్ కమిటీ (రసాయన శాస్త్రం) చైర్మన్ హీనర్ లింకే కొనియాడారు. కాగా, విజేతలు ముగ్గురికీ కలిపి అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (రూ.8.89 కోట్లు) అందజేస్తారు. గురువారం సాహిత్య, శుక్రవారం శాంతి, సోమవారం ఆర్థిక నోబెల్ విజేతలను ప్రకటించనున్నారు. విజేతలకు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న అవార్డులు అందజేస్తారు.
ప్రొటీన్ల డిజైనింగ్‌కు మార్గదర్శి..డేవిడ్ బకర్
ప్రఖ్యాత బయోకెమిస్ట్, కంప్యూటేషనల్ బయాలజిస్ట్ అయిన డేవిడ్ బకర్(62)వాషింగ్టన్ లోని సియాటెల్ లో 1962లో జన్మించారు. ప్రస్తుతం సియాటెల్ లోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో పని చేస్తున్నారు. 2003లో తొలిసారిగా తన టీమ్‌తో కలిసి ఒక కొత్త ప్రొటీన్‌ను డిజైన్ చేయడం ద్వారా ఆయన ప్రొటీన్ డిజైనింగ్ విభాగంలో మార్గదర్శిగా నిలిచారు. ఆ తర్వాత ఔషధాలు, వ్యాక్సిన్లు, నానోమెటీరియల్స్, సూక్ష్మ స్థాయి సెన్సర్ల వంటి వాటి తయారీకి ఉపయోగపడేలా ఎన్నో కొత్త ప్రొటీన్లను డిజైన్ చేశారు.
ఏఐతో ప్రొటీన్ల గుట్టువిప్పిన డెమిస్, జంపర్
సర్ డెమిస్ హసాబిస్ (48) లండన్ లో 1976లో జన్మించారు. జాన్ మైకేల్ జంపర్ (39) అమెరికాలోని అర్కాన్సస్ లో 1985లో పుట్టారు. రీసెర్చ్ సైంటిస్టులైన వీరిద్దరూ లండన్ లోని లండన్ లోని గూగుల్ డీప్ మైండ్ సంస్థలో పని చేస్తున్నారు. ‘‘సైంటిస్టులు ఇప్పటివరకూ దాదాపు 20 కోట్ల ప్రొటీన్లను గుర్తించారు. కానీ వీటి 3డీ స్ట్రక్చర్ ను ఊహించడం అనేది ఎంతోకాలంగా కలగానే మిగిలిపోయింది.
కానీ హసాబిస్, జంపర్ ఇద్దరూ కలిసి సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్ తో ఏకంగా 20 కోట్ల ప్రొటీన్ల 3డీ స్ట్రక్చర్ ను కంప్యూటర్ లో కచ్చితంగా ఊహించేందుకు సాధ్యమైంది. వీరిద్దరు 2020లో ఈ చిక్కుముడిని విప్పారు. దీంతో ఇప్పుడు ప్రకృతిలో ఉన్న ఎంతటి క్లిష్టమైన ప్రొటీన్ కు అయినా 3డీ నిర్మాణాన్ని ఇట్టే తెలుసుకునేందుకు మార్గం సుగమం అయింది” అని నోబెల్ కమిటీ కొనియాడింది.