- ఏడాదికిపైగా ఇండియన్ రెజ్లింగ్‌లో అనిశ్చితి
- మరో 8 రోజుల్లో ఒలింపిక్స్
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్) : ఒలింపిక్స్‌లో ఇండియాకు ఎక్కువ పతకాలు లభించే ఈవెంట్ రెజ్లింగ్. ఈ మెగా క్రీడల్లో మన దేశానికి తొలి వ్యక్తిగత పతకం లభించించి కూడా రెజ్లింగ్‌లోనే. 1952 ఒలింపిక్స్‌లో దివంగత రెజ్లర్ కషాబా దాదా సాహెబ్ జాదవ్ (కె.డి. జాదవ్) ఈ ఘనత సాధించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ మొదలు గత నాలుగు ఎడిషన్లలోనూ రెజ్లింగ్‌లో పతకం లేకుండా ఇండియా తిరిగొచ్చింది లేదు. గత టోక్యో గేమ్స్‌లో బజ్‌రంగ్ పునియా (బ్రాంజ్), రవి దహియా (సిల్వర్) డబుల్ ధమాకా మోగించారు. కానీ, వరుసగా 4 ఒలింపిక్స్‌లో సూపర్ సక్సెస్‌తో ఆకాశమంత ఎత్తుకు వెళ్లిన ఈ ఆట..
రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మేటి రెజ్లర్లు రోడ్డెక్కి పోరాటాలు చేయడంతో పాతాళానికి పడిపోయింది. నిరసనల కారణంగా నేషనల్ క్యాంప్స్ ఆగిపోయాయి. రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటు.. డోపింగ్ ఉదంతాలు ఏడాదికి పైగా ఇండియన్ రెజ్లింగ్‌ను ఊపేశాయి. ఈ పరిస్థితుల్లో గత 4 ఎడిషన్ల పతక పరంపరను కొనసాగించేందుకు ఆరుగురు రెజ్లర్లు పారిస్ ఒలింపిక్స్‌లో పోటీకి రెడీ అయ్యారు. వీరిలో పతకాలు ‘పట్టు’కొచ్చే సత్తా ఎవరికి ఉందో మరి!
అంతిమ్ పంగల్ (53 కేజీ)
ఫైర్ బ్రాండ్ రెజ్లర్ అంతిమ్ పంగల్ అందరికంటే ముందుగానే పారిస్ కోటా దక్కించుకుంది. రెజ్లర్ల నిరసన పతాక స్థాయిలో ఉన్నప్పుడు వినేశ్ ఫొగట్‌తో ట్రయల్ నిర్వహించాలని సవాల్ చేసింది. జిమ్నాస్టు మాదిరిగా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఆమె అతి పెద్ద బలం. ఇది ప్రత్యర్థుల పట్టు నుంచి ఈజీగా బయటపడేలా చేస్తుంది. ఆమెను ట్రాప్ చేయడం కష్టం. మ్యాట్‌పై అత్యంత చురుగ్గా, దూకుడుగా ఉంటుంది. అయితే, వెన్ను గాయానికి గురైన అంతిమ్ ఆసియా గేమ్స్ తర్వాత పోటీలకు దూరంగా ఉండటం మైనస్ కానుంది.
వినేశ్ ఫొగట్ (50 కేజీ)
దేశ అత్యుత్తమ మహిళా రెజ్లర్లలో ముందుండే వినేశ్ ఫొగట్ బలమైన డిఫెన్స్, అంతే మెరుగైన ఎటాకింగ్ స్కిల్స్‌కు పెట్టింది పేరు. కానీ, నిరసనల్లో పాల్గొన్న కారణంగా ఏడాదికి పైగా టాప్ క్లాస్ ప్రత్యర్థులతో పోటీకి దూరంగా ఉండటం ఆమెకు ప్రతికూలాంశం కానుంది. సాధారణంగా 55–56 కేజీల్లో తలపడే వినేశ్ తన వెయిట్ క్లాస్ తగ్గించుకొని 50 కేజీల్లో బరిలోకి దిగుతోంది. వినేశ్ 30 ఏండ్లకు సమీపిస్తోంది. ఈ వయసులో బౌట్‌కు ముందు బరువు తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. దాంతో శరీరంలోని శక్తి మొత్తం సన్నగిల్లుతుంది. బౌట్‌లో ప్రత్యర్థుల కంటే ఈ విషయంలోనే వినేశ్‌కు సవాల్ ఎదురవనుంది.
అన్షు మాలిక్ (57 కేజీ)
జూనియర్ సర్క్యూట్‌లో సంచలనాలు సృష్టించిన అన్షు అదే జోరును సీనియర్ లెవెల్‌లో కొనసాగించలేకపోయింది. గాయాలు ఆమెను ఇబ్బంది పెట్టాయి. అయినా పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా నుంచి మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. దూకుడైన శైలితో మ్యాట్‌పై మెరుపు వేగంతో కదలడం ఆమె అతి పెద్ద బలం. టీనేజర్‌గా టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడ్డ తను ఇప్పుడు పరిణితి చెందిన రెజ్లర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కానీ, ఆమె ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నాయి.
నిషా (68 కేజీ), రితిక (76 కేజీ)
సైలెంట్‌గా పారిస్ గేమ్స్‌కు క్వాలిఫై అయిన నిషా దహియా యంగ్ ఏజ్‌లోనే పేరు తెచ్చుకుంది. కానీ, గాయాలు ఆమె ప్రయాణానికి అడ్డు తగిలాయి. బయట సైలెంట్‌గా ఉండే నిషా మ్యాట్‌పైకి రాగానే తన దూకుడైన ఆటతో బలమైన ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తుంది. అనుభవం, నిర్భయంగా ఆడే విధానం ఆమెకు అతిపెద్ద బలం. కానీ, మెగా ఈవెంట్లలో పోటీ చేయకపోవడం, బౌట్ చివరి నిమిషాల్లో పట్టు కోల్పోవడం ఆమె బలహీనతలు.
ఇక, పారిస్‌కు సెలెక్ట్ అయిన వారిలోఅంతగా పేరు లేకపోయినా ప్రత్యర్థులను ఆశ్చర్యపరిచే సత్తా రీతికా హుడాకు ఉంది. హుడా ఆటలో పవర్, టెక్నిక్ ఉన్నాయి. కానీ, బౌట్ చివరి 30 సెకండ్లలో పాయింట్లు చేజార్చుకుంటుంది. తొలుత ఆధిక్యంలో నిలిచినా.. చివరికి వెనుకంజ వేస్తుంటుంది. ఈ బలహీనత నుంచి బయటపడితేనే పారిస్‌లో మెప్పించగలదు.
అమన్ సెహ్రావత్ (మెన్స్ ఫ్రీ స్టయిల్ 57కేజీ)
ఈ ఒలింపిక్స్‌కు ఎంపికైన ఆరుగురిలో ఏకైక అబ్బాయి అమన్. కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడు. టోక్యోలో సిల్వర్ గెలిచిన రవి దహియా స్థానంలో 57 కేజీ వెయిట్ కేటగిరీలో అమన్ బలమైన పోటీదారుగా ఉన్నాడు. ఈసారి ఇండియాకు పతకం తెస్తాడని ఆశిస్తున్న వారిలో అమన్ కూడా ఒకడు. సత్తువ, సహనం అతని అది పెద్ద బలాలు. ఎంత బలమైన ప్రత్యర్థి ఎదురుగా ఉన్నా తను అంత తేలిగ్గా తలొగ్గడు. బౌట్ ఆరు నిమిషాలు సాగినా అతడిని ఓడించడం అంత సులువు కాదు. కానీ, వ్యూహాలు, టెక్నిక్ విషయంలో కాస్త వెనుకంజలో ఉన్నాడు.
ఈ కారణంగానే హంగేరిలో జరిగిన ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్‌లో రీ హిగుచి (జపాన్) చేతిలో పిన్ డౌన్ అయ్యాడు. ప్రత్యర్థి తన వ్యూహాలను పసిగట్టినప్పుడు అమన్ వద్ద ప్లాన్–బి లోపిస్తోంది. అలాగే, ప్రతీ ప్రత్యర్థికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం అతి ముఖ్యం. హిగుచి, గులోమ్జోన్ అబ్దుల్లెవ్ (ఉజ్బెకిస్తాన్) నుంచి అతనికి ముప్పు ఉంది.