ఇదివరకు రోజుల్లో రాఖీ పండుగ వస్తుందంటే... నోరు తీపి చేసుకునేందుకు ఇంట్లోనే స్వీట్లు తయారుచేసేవాళ్లు. కానీ ఇప్పుడు అన్నింటిలో మార్పులు వస్తున్నట్టే వంటకాల్లో, రుచుల్లో కూడా మార్పులు వచ్చేశాయి. అలా స్వీట్స్‌కి వచ్చి చేరిన కొత్త రుచులే ఈసారి రాఖీ పండుగ స్పెషల్. వాటిలో కొన్ని వెరైటీ స్వీట్స్ ఇవి..
చాకొలెట్ - బిస్కెట్ స్వీట్
కావాల్సినవి :
చాకొలెట్ క్రీమ్ బిస్కెట్స్ - ఇరవై ఐదు
బాదం, జీడిపప్పు పలుకులు - రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్,
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
పాలు - ఒక కప్పు
తయారీ : మిక్సీజార్‌లో బిస్కెట్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి అందులో బాదం, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. ఆ తర్వాత పాలు పోసి మరోసారి బాగా కలిపి ముద్దగా చేయాలి. ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండను అరచేతిలో పెట్టి వత్తాలి. దానిపై వేలితో నొక్కి అందులో డ్రై ఫ్రూట్స్ పలుకులు వేస్తే చాకొలెట్ బిస్కెట్ రెడీ. చాలా ఫాస్ట్ అండ్ సింపుల్ కదా ఈ రెసిపీ.
చాకొలెట్ - పీనట్ బాల్స్
కావాల్సినవి :
పల్లీలు - అర కప్పు, బిస్కెట్స్ - నాలుగు
చాకొలెట్ (కరిగించి) - ముప్పావు కప్పు
తయారీ : నూనె వేయకుండా పల్లీలు వేగించాలి. మిక్సీజార్‌లో బిస్కెట్స్, వేగించిన పల్లీలు వేసి పొడిపట్టాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేయాలి. అందులో కరిగించిన నాలుగు టేబుల్ స్పూన్ల చాకొలెట్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముద్దగా చేసి దాన్నుంచి చిన్న చిన్న బాల్స్ తయారుచేయాలి. ఈ బాల్స్‌ను కరిగించిన చాకొలెట్లో ముంచాలి. తర్వాత వాటిని బటర్ పేపర్ మీద పెట్టాలి. ఆపై చాకొలెట్ సిరప్‌ని డిజైన్‌గా వేయొచ్చు. అవి ఆరిపోయాక చాకొలెట్ పీనట్ బాల్స్‌ని తినడమే.
రాయల్ రోజ్ చాకొలెట్స్
కావాల్సినవి :
వైట్ చాకొలెట్ (కరిగించి) - 200 గ్రాములు
రోజ్ ఎసెన్స్ - రెండు చుక్కలు
మిక్స్డ్ డ్రైఫ్రూట్స్, సీడ్స్ పౌడర్ - కావాల్సినంత
గులాబీ రేకులు - ఒక టీస్పూన్
మిక్స్డ్ డ్రైఫ్రూట్స్, సీడ్స్ - కావాల్సినన్ని
ఫుడ్ కలర్ - రెండు చుక్కలు
తయారీ : వైట్ చాకొలెట్ కరిగించి ఒక గిన్నెలో వేయాలి. అందులో రోజ్ ఎసెన్స్, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్, సీడ్స్ పౌడర్, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్, సీడ్స్, గులాబీ రేకులు, ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చాకొలెట్ మౌల్డ్‌లో గులాబీ రేకులు చల్లాలి. అందులో రెడీ చేసుకున్న మిశ్రమం వేయాలి. ఒక గంటసేపు ఫ్రిజ్‌లో పెడితే రాయల్ రోజ్ చాకొలెట్స్ తినడానికి రెడీ!
మిల్క్ పౌడర్ మిఠాయి
కావాల్సినవి :
మిల్క్ పౌడర్ - ఒక కప్పు
చక్కెర - అర కప్పు
పాలు - అర కప్పు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
మిల్క్ చాకొలెట్, వైట్ చాకొలెట్ - కావాల్సినంత
యాలకుల పొడి - అర టీస్పూన్
తయారీ : ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో పాలు పోయాలి. అందులో చక్కెర కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో మిల్క్ పౌడర్ కలపాలి. మిశ్రమం దగ్గరపడ్డాక యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత ఏడు నిమిషాలు ఆ మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. మిశ్రమం గిన్నెకు అంటుకోకుండా వచ్చేవరకు తిప్పాలన్నమాట. ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కాసేపు పక్కన పెట్టి వేడి మీదనే ఉండలు చేయాలి. ఆ ఉండల్ని నెయ్యి రాసిన ప్లేట్ మీద పేర్చాలి. ఆ తర్వాత మిల్క్ చాకొలెట్, వైట్ చాకొలెట్ విడివిడిగా కరిగించాలి. రెడీ అయిన బాల్స్‌ని చాకొలెట్ మిశ్రమాల్లో ముంచాలి. కావాలంటే ఒక్కదాన్లో అయినా బాల్స్‌ని ముంచొచ్చు.
బ్రెడ్ - మలాయ్ స్వీట్
కావాల్సినవి :
బ్రెడ్ ముక్కలు - ఆరు
మిల్క్ పౌడర్ - ఒక కప్పు
తాజా మలాయ్ - మూడు టేబుల్ స్పూన్లు
యాలకులు - రెండు, నెయ్యి - ఒక టీస్పూన్
చక్కెర - ఐదు టేబుల్ స్పూన్లు
తయారీ : మిక్సీజార్‌లో చక్కెర, యాలకులు వేసి మిక్సీ పట్టాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేయాలి. బ్రెడ్ ముక్కలు మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని చక్కెర పొడిలో కలపాలి. అందులో మిల్క్ పౌడర్, మలాయ్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముద్దగా అయ్యేవరకు కలపాలి. తరువాత నెయ్యి వేసి మరోసారి కలపాలి. ఇష్టపడే వాళ్లు ఇందులో ఫుడ్ కలర్ కూడా కలపొచ్చు. ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి దానిపై ఈ ముద్దను పెట్టి సమంగా అదమాలి. దానిపై అక్కడక్కడ జీడిపప్పులు పెట్టి నచ్చిన షేప్ మౌల్డ్‌తో ప్రెస్ చేయాలి.