- కళాకారుల ప్రదర్శనలు.. ఆడిపాడిన ఆడ బిడ్డలు
- హాజరైన మంత్రి సీతక్క, ప్రజా గాయని విమలక్క
- పటాకుల మోత.. లేజర్ షోతో వెలుగులు
తొమ్మిది రోజులు తీరొక్క పూలతో, ఆడబిడ్డల ఆటపాటలతో ఉయ్యాలలూగిన బతుకమ్మ..గంగమ్మ ఒడికి చేరింది. గురువారం సద్దుల బతుకమ్మ సంబురాలు రాష్ట్రమంతా ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై వేల మంది ఆడబిడ్డలు ఒక్క చోటకు చేరి బతుకమ్మ ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరంగల్ పద్మాక్షి గుట్ట, కరీంనగర్ టవర్ సర్కిల్, నిజామాబాద్ పూలాంగ్ చౌరస్తా.. ఇట్ల ఎటు చూసినా యావత్ తెలంగాణం పూలవనమైంది. సాయంత్రం నుంచి రాత్రి దాకా ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి.. ఆ తర్వాత చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేశారు. పసుపుల పుట్టె గౌరమ్మ.. పసుపుల పెరిగే గౌరమ్మ.. పసుపుల వసంతమాడంగా.. పోయిరా గౌరమ్మ” అంటూ బతుకమ్మను సాగనంపి.. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వెంట తెచ్చుకున్న సద్దులను అక్కడే గట్ల మీద విప్పి, పిల్లాపాపలతో కలిసి ఆరగించి.. ఇండ్లకు తిరుగు పయనమయ్యారు.
హైదరాబాద్ సిటీ, వెలుగు : ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది ఆడ బిడ్డలు ‘బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో’ అంటూ ఆడి పాడారు. పటాకుల మోత... లేజర్ షో వెలుగులతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మెరిసిపోయాయి. సాంస్కృతిక కార్యక్రమాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. అందరినీ ఆకట్టుకున్నాయి. ట్యాంక్ బండ్‌పై ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి వేలాది మందితో ప్రారంభమైన బతుకమ్మల శోభాయాత్ర.. రోటరీ క్లబ్ వరకు సాగింది. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా రూపాలు, ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమైన కళారూపాల ప్రదర్శన.. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన స్టేజీ వరకు సాగింది. కొమ్ము కోయా డోలు దెబ్బలు... ఒగ్గు డోలు కళాకారులు నృత్యాలు.. సంప్రదాయ దుస్తులతో లంబాడీ మహిళల నృత్యాలు.. పోతురాజుల విన్యాసాలు.. డప్పు కళాకారుల దరువుల మధ్య బతుకమ్మ శోభాయాత్ర సాగింది. అదేవిధంగా.. లేజర్ షో, క్రాకర్స్ షాట్స్ ఆకట్టుకున్నాయి.
ఉత్సాహంగా బతుకమ్మ శోభాయాత్ర
అమరవీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి సీతక్క, ప్రజా గాయని విమలక్క, డిప్యూటీ మేయర్ శ్రీలత, పర్యాటక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్ పూజలు చేసి బతుకమ్మ శోభాయాత్రను ప్రారంభించారు. కళాకారుల ప్రదర్శనల మధ్య బతుకమ్మలతో ఆడ బిడ్డలంతా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య, వాణి ప్రసాద్ ను మంత్రి సీతక్క సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. తర్వాత బతుకమ్మలను లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చిల్డ్రన్స్ రోటరీ పార్క్‌లో నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కోదండరాం, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు, మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ, ఆడ బిడ్డలను కాపాడుకుందాం: మంత్రి సీతక్క
తెలంగాణ పండుగ బతుకమ్మతో పాటు ఆడ బిడ్డలను కాపాడుకుందామని మంత్రి సీతక్క అన్నారు. అమ్మాయిలను చిన్న చూపు చూడొద్దని తెలిపారు. వాళ్లను చదివించి.. ఇష్టమైన రంగంలో ఉద్యోగం చేసేందుకు చేయూత ఇవ్వాలని అన్నారు. ‘‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా పని చేస్తున్నారు. తన పాట ద్వారా సమానత్వం కోసం పోరాడుతున్న విమలక్కకు అభినందనలు. బతుకమ్మ అంటే.. బతుకునిచ్చే పండుగ.. తెలంగాణ అంటేనే చెరువులు, వాగులు.. అడవులు.. గుట్టలు. చెరువులు నిండితేనే పంటలు పండుతయ్. బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం. తెలంగాణ పూల పండుగ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాం’’అని సీతక్క పిలుపునిచ్చారు.
హైడ్రాను స్వాగతిస్తున్నాం : విమలక్క
చెరువులు, కుంటలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నామని ప్రజా గాయని విమలక్క అన్నారు. చెరువులను కాపాడుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన బాగుందని కొనియాడారు. ‘‘బతుకమ్మకు కులం.. మతం లేదు. సామాజిక, ఆర్థిక అసమానత తొలగిపోవాలి. హైడ్రాతో చెరువులు, కుంటలతో పాటు ప్రకృతిని కాపాడుకోవాలి. హైడ్రాలో ప్రజలు భాగస్వాములు కావాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఉపా కేసులు ఎత్తేయాలి’’అని విమలక్క కోరారు.