ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాల గురించే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు నార్త్‌కు ధీటుగా సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకుంటూ వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగి సినిమాలకు భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని మరోసారి ఫ్రూవ్ చేశాయి.
అలాగే జాతీయ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్‌లతో పాటు పలు ప్రెస్ట్రీజియస్ అవార్డులతోనూ సౌత్ సినిమా దుమ్ము లేపుతోంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మొదలు ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఎక్కువ ఆదరణ దక్కించుకున్న చిత్రాలు, బాక్సాఫీస్ వద్ద రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమాల గురించి తెలుసుకుందాం.
‘హనుమాన్’తో మొదలైన జైత్ర యాత్ర
సినిమాకు రూ.వంద కోట్ల వసూళ్లు రావాలంటే స్టార్ హీరోనే అవసరం లేదని నిరూపించాడు తేజ సజ్జా. తను హీరోగా నటించిన ‘హనుమాన్’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. యంగ్ హీరోల్లో ఈ రేర్ ఫీట్ సాధించాడు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘టిల్లు’గాని రచ్చ
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన ‘టిల్లు స్క్వేర్’.. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. సిద్ధు కెరీర్‌లోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో తన స్టామినాను పెంచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
కోట్లు కొల్లగొట్టిన ‘కల్కి’
ఈ ఏడాది రూ.పన్నెండు వందల కోట్ల కలెక్షన్స్‌తో ‘కల్కి’ చిత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ఈ ఏడాది జూన్‌లో విడుదలై ట్రెమండెస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వరల్డ్‌వైడ్‌గా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఇది ఆరోవది కావడం విశేషం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘సరిపోదా’తో బ్యాక్ టు బ్యాక్
ఇప్పటికే ‘దసరా’ చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. ఈ ఏడాది ‘సరిపోదా శనివారం’ సినిమాతో మరోసారి సత్తా చాటాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘దేవర’ ముంగిట నువ్వెంత
ఈ ఏడాది వచ్చిన మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీస్‌లో ‘దేవర’ ఒకటి. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ సక్సెస్‌తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలా సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా.. కొన్ని వారాలకే థియేటర్స్ నుంచి తప్పుకుంటాయి. 50 రోజులు, 100 రోజులు అనే మాటలు మర్చిపోయిన ఈ రోజుల్లో ఈ మూవీ ఆ రేర్ ఫీట్ సాధించింది. 52 సెంటర్స్‌లో 50 రోజులు విజయవంతంగా ఈ చిత్రం ప్రద్శర్శితమైంది. ఈ చిత్రానికి రూ.509 కోట్ల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ తెలియజేశారు.
‘లక్కీ’ దుల్కర్
ఈ దీపావళికి ‘లక్కీ భాస్కర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంతో వంద కోట్లు వసూళ్లు రాబట్టాడు. బ్యాంకింగ్ నేపథ్యంతో వెంకీ అట్లూరి రూపొందించిన ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15కు పైగా దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్‌లో చోటు దక్కించుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
‘క’తో కలెక్షన్లు
కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ చిత్రం కూడా దీపావళి బాక్సాఫీస్ రేసులో ముందుంజలో నిలిచింది. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించి కిరణ్‌ను మరో మెట్టు పైకి ఎక్కించింది. సుజీత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. కిరణ్ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది.
అస్సలు తగ్గేదే లే
‘పుష్ప2’ కలెక్షన్లతో ప్రభంజనం సృష్టిస్తూ అస్సలు తగ్గేదే లే అంటున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ రీసెంట్‌గా విడుదలై రూ.600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్‌లో చేరింది. ఫస్ట్ డే దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచి.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్‌లో ఈ చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. హిందీలో మొదటి రోజు రూ.72 కోట్లు వసూళ్లు చేయగా, రెండో రోజు రూ.59 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ.205 కోట్లు రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
క్రేజీ కోలీవుడ్
ఈ ఏడాది తమిళనాట విడుదలైన హిట్ చిత్రాల్లో ‘అమరన్’ ఒకటి. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియావైడ్‌గా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా రూ.320 కోట్ల గ్రాస్ రాబట్టి శివ కార్తికేయన్ కెరీర్‌లో ది బెస్ట్ హిట్‌గా నిలిచింది. అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.
ఇక విజయ్ నటించిన ‘గోట్’ మూవీకి పలు చోట్ల మిక్సిడ్ టాక్ వచ్చినా.. వసూళ్లలో మాత్రం రికార్డు క్రియేట్ చేశాడు. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి ఇంప్రెస్ చేశాడు విజయ్. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అలాగే రజినీకాంత్ ‘వేట్టయాన్’ రూ.250 కోట్లు గ్రాస్ రాబట్టగా, ధనుష్ ‘రాయన్’, విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాలు రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేశాయి.
మెప్పించిన మాలీవుడ్
ఈ ఏడాది మలయాళంలో విడుదలైన ‘మంజుమ్మల్ బాయ్స్’ చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. రూ.240 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో నటించిన ‘ద గోట్ లైఫ్’ రూ.160 కోట్లు, అలాగే ‘ప్రేమలు’ చిత్రం రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి మలయాళంలో మెప్పించాయి. తెలుగులోనూ ఈ చిత్రాలకు మంచి ఆదరణ దక్కింది.మరో ఇరవై రోజుల్లో ఈ ఏడాది పూర్తి కావొస్తుండటంతో ఈ రికార్డుల చిత్రాల్లో మరేదైనా చేరుతుందేమో చూడాలి.!