Sri Rama Navami : నాడు పంచాహ్నికం..నేడు నవాహ్నికం

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. దాంతో ఆలయం కూడా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. అందుకే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో గతంతో పోలిస్తే అనేక మార్పులు, చేర్పులు జరిగాయి. తొలినాళ్లలో స్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు పంచాహ్నికంగా చేసేవాళ్లు.. ఇప్పుడు తొమ్మిది రోజులు నవాహ్నికంగా జరుగుతున్నాయి. ఇలా కొన్నేండ్లలో వచ్చిన మార్పుల గురించి... 

భద్రాద్రి రామక్షేత్రంలో పాంచరాత్రగమ శాస్త్రోక్తంగా కల్యాణం చేస్తారు. మొదట్లో 1935–45ల్లో  ఐదు రోజుల పాటు కల్యాణం చేయడంతో పంచాహ్నిక బ్రహ్మోత్సవాలుగా పిలిచేవాళ్లు.1950 తర్వాత కల్యాణ మహోత్సవంలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఏడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరపాలని ఆనాటి వైదిక కమిటీ నిర్ణయించింది.

దాంతో సప్తాహ్నిక బ్రహ్మోత్సవాలు చేయడం మొదలైంది. కాల క్రమంలో మళ్లీ మార్పులు జరుగుతూ ప్రస్తుతం తొమ్మిది రోజులు కల్యాణోత్సవం జరుగుతుండటంతో నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా పిలుస్తున్నారు. ఈ నెల17న శిల్ప కళాశోభితమైన కల్యాణ మండపంలో సీతారామచంద్రస్వామి కల్యాణం జరగనుంది. 

కల్యాణ వేదిక 

భక్తరామదాసుగా ప్రసిద్దిగాంచిన కంచర్ల గోపన్న హయాంలో ఆలయంలో ఉన్న యాగశాలపై ఉండే మండపంలో స్వామి కల్యాణం చేసేవాళ్లు. తర్వాత ప్రస్తుతం చిత్రకూట మండపం ఉన్న ప్లేస్‌‌‌‌లో ఇదివరకు ఉన్న మండపంలో చేసేవాళ్లు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయంలో కల్యాణం నిర్వహించడం ఇబ్బందిగా మారింది.

దాంతో.. 1964లో ఆలయ ఉత్తరం వైపున కొత్త కల్యాణ మండపం కట్టించారు. అప్పటినుంచి స్వామి కల్యాణాన్ని ప్రతి ఏటా ఇక్కడే చేశారు. తర్వాత 1987లో మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని మిథిలాస్టేడియాన్ని నిర్మించారు. దీంతో భక్తులందరికీ  జగదభిరాముని కల్యాణాన్ని చూసే అవకాశం కలిగింది.

శిల్ప కళాశోభితం...కల్యాణ మండపం

మిథిలాస్టేడియంలో శిల్ప కళాశోభితమైన మండపంలో జరిగే కల్యాణాన్ని చాలామంది చూస్తారు. కానీ, ఆ కల్యాణ మండపం గురించి చాలామందికి తెలియదు. 1960లో సుప్రసిద్ధ శిల్పాచార్యులు గణపతి స్థపతి ఈ మండప నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్లు శ్రమించి తన కళా నైపుణ్యంతో తీర్చిదిద్దారు. దీన్ని చూసిన వాళ్లు సాంకేతికత అంతగా లేని నాటి రోజుల్లో ఈ నిర్మాణం ఎలా సాధ్యమైంది? అని ఆశ్చర్యపోతారు.

దిండివనం నుంచి 

తమిళనాడులోని  దిండివనం గ్రామం నుంచి ఆకుపచ్చ ధాతు రాయిని, భద్రాచలం దగ్గర్లోని తాటాకుల గూడెం నుంచి నల్ల రాయిని తెప్పించారు. శిల్పుల చేతుల్లో శిలలు మైనమైపోయాయి. కల్యాణ మండపం 31 చదరంలో ఉపోపపీఠం చేయబడింది.

ఈ పీఠం పైవరుసలో 50 నడిచే ఏనుగులను చెక్కారు. ఉపోపీఠం పైభాగంలో ప్రతోపపీఠం అమర్చారు. ఇది పద్మదళాలతో ఉంటుంది. స్తంభ భూషణ లక్షణాలను అనుసరించి ఒక్కో స్తంభపు ఉప పీఠాన్ని నిర్మించారు. వాటిపై క్షేత్ర మహత్యం తెలిసేలా శిల్పాలు చెక్కారు. 

ఎన్నో విగ్రహాలు

ముందు వరుసలో గరుత్మంతుడు, జయవిజయులను, ఆంజనేయస్వామి విగ్రహాలను పెట్టారు. రామదాసు, శివధనుర్భంగం, చతుర్భుజ రాముడు, పాణిగ్రహణం, పోకల దమ్మక్క, శేషసాయి, శ్రీరామపట్టాభిషేకం, గీతోపదేశం, జనకమహారాజు కన్యాదానం, పంచముఖ వాద్యం, భద్రునికి రామసాక్షాత్కారం ముందు వరుసలో ఉన్నాయి. శివధనుర్భంగ వృత్తాంతంలో రెండో పాణిగ్రహణంలో16, పట్టాభిషేకంలో 12, కన్యాదానంలో13 విగ్రహాలు మలిచారు. శిల్పశాస్త్రం ప్రకారం ఈ భాగాన్ని ‘కంఠం’ అంటారు. ఈ మండపంలో మరో అద్భుత నిర్మాణం కపోత పట్టిక.

దీనితో ‘మతలై’ అనే పేరు గల  కొన్ని వందల శిల్పాలు ఉన్నాయి. పైభాగం చూరులా ఉంటుంది. దీనినే ‘కపోతకం’ అంటారు. దీనిలో 13 పద్మదళాలు, అష్టదిక్పాలకులు, అష్టలక్ష్ములు, గరుత్మంతుడు, మహా సాలభంజికలు నిర్మించారు. పత్రోప పీఠంపై మెట్లు, మెట్లకు రెండు వైపులా ఏనుగులు, కోలాటం ఆడే స్త్రీలు, హంసలు ఉన్నాయి. ఈ పత్రోప పీఠంపై పద్మాసనం నల్లరాతితో నిగనిగలాడుతుంది. దీనిపైనే సీతారాముల కల్యాణం జరుగుతుంది.9 టన్నుల బరువు ఉండే ఏకశిలతో దీన్ని నిర్మించారు. దీని అష్టదళాలపై అష్టమంగళం కన్పిస్తుంది.

శంఖం, చక్రం, మత్స్యయుగ్మం, దర్పణం, స్వస్తికం,ఈపం, పూర్ణకుంభం, శ్రీవత్సం మొదలైన వాటిని ‘అష్టమంగళం’ అంటారు. ఈ మండపాన్ని ‘షోడశ స్తంభ మండపం’ అంటారు. ఇది16 స్తంభా లతో విలసిల్లుతుంది. ఈశాన్య స్తంభంలో అనేక శిల్ప శాస్త్ర, సాంకేతిక విషయాలున్నాయి. దీనిపై ‘పద్మ పుష్కలం, అధిష్టానం, పద్మదళాలు’ నిర్మించారు. ముందుభాగంలో చెక్కిన మూడు ముఖ పత్రాలపై మూడు సింహాలు ఉన్నాయి. ఈ సింహాల నోటిలో అదే రీతిలో చెక్కిన రాతిగుండ్లు ఉన్నాయి. ముఖ స్తంభంలో కమల

రామదాసుల శిల్పాలు, మండప ద్వారం ముందు పడమరగా రుక్మిణీ, సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు, ఆగ్నేయ స్తంభంపై భూదేవి సమేతుడైన పరవాసుదేవుడు, చెలికత్తెలతో శ్రీమహాలక్ష్మీ, ఆళ్వార్లు విరాజిల్లుతున్నారు. షోడశ భుజాలతో అలరారే సుదర్శనమూర్తి కూడా ఉన్నారు. నైరుతి స్తంభంలో ఉత్తర భాగంలో పాదారవిందుడైన వేణుగోపాలుడు, పైభాగంలో వటపత్రశాయి కనులవిందుగా దర్శనం ఇస్తారు. తూర్పు వైపు సరస్వతీ దేవి వీణాపాణిలా కనిపిస్తుంది.

దక్షిణంగా కాళీయమర్ధన, రాధాకృష్ణులు, హంస, బ్రహ్మ ఉంటారు. స్తంభాలకు పై భాగంలో నాలుగు మూలల్లో నాలుగు రాతి గొలుసులు వేలాడుతుంటాయి. ఒక్కో గొలుసుకు నాలుగు అంగుళాల పొడవు ఉండే 50  రింగులు ఉన్నాయి. పైకప్పు లోపలి భాగంలో12 కోష్టములు, రాశిచక్రం కన్పిస్తాయి. ఇంకా అనేక శిల్ప విశేషాలతో విరాజిల్లుతున్న ఈ కల్యాణ మండపం భారతదేశ శిల్ప కళాఖండాల్లోనే ప్రాముఖ్యమైనదిగా చెప్తుంటారు.  

రామదాసు ఆభరణాలు

భద్రాద్రి సీతారాములకు ఆనాడు భక్తరామదాసు అనేక బంగారు ఆభరణాలు చేయించాడు. అవే కాకుండా ఏటా భక్తులు ఎన్నో ఆభరణాలు కానుకలుగా సమర్పిస్తున్నారు. వజ్రాలు పొదిగిన విలువైన పచ్చలు, పచ్చల పతకం, లేత చింతాకు పతకం, కలికితురాయి... తదితర విలువైన ఆభరణాలు లాంటివి ఎన్నో ఉన్నాయి.

భద్రాద్రి రాముడికి రామదాసు చేయించిన ఆభరణాలనే నేటికీ అలంకరిస్తున్నారు. రామదాసును చెరసాల నుంచి విడిపించడానికి తానీషా నవాబ్‍కు రామలక్ష్మణులు సమర్పించారన్న బంగారు రామమాడ నాణేలు కొన్ని ఈ నాటికీ భద్రాద్రి ఆలయంలో ఉన్నాయి. ‘రామటెంకి’గా పిలిచే ఈ నాణెంపై దేవగిరి లిపి ఉంది. కల్యాణం రోజున శ్రీరాముడికి అలంకరించే రవ్వల వైరముడి, మధ్యలో నీలపురాయి మద్రాసుకు చెందిన ఓ వేశ్య శ్రీరాముడికి సమర్పించిందని కథనం. తూము నర్సింహదాసు స్థిరీకరించిన మహారాజ సేవోత్సవం సందర్భంగా ఆయన రాసిన కీర్తన

పూజ సేయరే స్వామికి బంగారు పూలతో పూజ సేయరే ’ అన్న దానికి అన్వయిస్తూ త్రిదండి చినజీయర్‍స్వామి 108బంగారు పుష్పాలను సమర్పించారు. సీతమ్మకి, రాములోరికి కంకణాల అలంకరణకు సయ్యద్‍మీరా అనే ముస్లిం భక్తుడు బంగారు తోడాలు ఇచ్చారు. భక్తరామదాసు 30 తులాలతో చేయించిన మూడు బంగారు మంగళ సూత్రాలతోనే కల్యాణం రోజున సీతమ్మకి సూత్రధారణ జరుగుతుంది. ఆ తర్వాత కూడా చాలామంది భక్తులు స్వామికి ఎన్నెన్నో ఆభరణాలు, అలంకారాలు చేయించారు. 

మాంగల్య విశేషం ఇదీ...

భక్తరామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న చేయించిన మంగళసూత్రానికి ఎంతో విశేషం ఉంది. కన్యాదాతగా మూడు తాళిబొట్లతో ఆయన మంగళసూత్రాన్ని తయారు చేయించారు. వాస్తవానికి హిందూ సంప్రదాయంలో పెళ్లి కుమారుడి వైపు ఒకటి, పెళ్లి కుమార్తె వైపు మరొక మంగళసూత్రం ఉండటం సహజం. కానీ భక్తరామదాసు సీతారాముల కల్యాణ సమయంలో తయారుచేయించి సమర్పించిన మంగళ సూత్రంలో మూడు సూత్రాలు ఉంటాయి.

ఇందులో ఒకటి దశరథ మహారాజు తరఫున, రెండోది జనక మహారాజు నుంచి, మూడోది సీతమ్మను తన కూతురిగా భావించి యావత్ హిందూ భక్తసమాజం తరఫున సమర్పించింది. ఈ క్రమంలో ఏటా సీతారాముల కల్యాణానికి ఈ మూడు సూత్రాలు ఉన్న మంగళసూత్రాన్నే అర్చకులు రామయ్య తరఫున సీతమ్మకి సమర్పిస్తారు.

భద్రాచలం, వెలుగు