సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో డబ్బింగ్ చిత్రాల హవా కూడా బాగా కొనసాగుతోంది. గతంలో యూనివర్సల్ కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు నటీనటులు, భాష, నేటివిటీతో సంబంధం లేకుండా విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తుండగా, మరికొన్ని డీలా పడుతున్నాయి. అలాగే ఈ ఏడాది తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి డబ్ అయిన సినిమాల జయాపజయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తమిళ తళుకులు
ఈ ఏడాది విడుదలైన అన్ని డబ్బింగ్ చిత్రాల్లోకల్లా అత్యధిక వసూళ్లతో పాటు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సినిమాగా ‘అమరన్’ నిలిచింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజునుంచే తమిళంతోపాటు, తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి దీన్ని తెరకెక్కించగా శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించారు. సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మించారు. అలాగే దసరాకి ‘వేట్టయాన్’గా వచ్చిన రజినీకాంత్ తెలుగు ప్రేక్షకుల దగ్గర మరోసారి మంచి మార్కులు కొట్టేశారు. టీజే జ్ఞానవేల్ రూపొందించిన ఈ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.
మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా ‘మహారాజా’గా ఆడియెన్స్ ముందుకొచ్చిన విజయ్ సేతుపతి తనదైన యాక్టింగ్‌తో అందర్నీ అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకుంది . ఇటీవలే చైనాలోనూ విడుదలై అక్కడ కూడా సూపర్ సక్సెస్ సాధించింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోలు అరవింద్ స్వామి, కార్తి లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’కు ఆడియెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా అటు తమిళంలో పాటు ఇటు తెలుగులోనూ మంచి టాక్‌తో దూసుకెళ్లింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే ఈ యేడు ధనుష్ నుంచి ‘కెప్టెన్ మిల్లర్’, ‘రాయన్’ చిత్రాలు రాగా రెండూ పర్వాలేదనిపించాయి. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన కమల్ హాసన్ ‘ఇండియన్2’, విజయ్ ‘గోట్’, సూర్య ‘కంగువా’ విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఆడియెన్స్‌ను కూడా తీవ్ర నిరాశపరిచాయి. ఈ సినిమాల కోసం హీరోలు డిఫరెంట్ గెటప్స్‌తో ప్రయోగాలు చేసినా మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అలాగే జయం రవి ‘సైరన్’, విశాల్ ‘రత్నం’ లాంటి సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. విఫలమైన చిత్రాల్లో కొన్నింటికీ కొనసాగింపును కూడా ప్రకటించారు. మరి ఈ ఘోరమైన రిజల్ట్‌తో అవి తెరకెక్కుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకమే.
మలయాళ మెరుపులు
మలయాళంలో ఈయేడు వచ్చిన సినిమాల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చి దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మాలీవుడ్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. సర్వైవర్ థ్రిల్లర్‌గా చిదంబరం ఈ చిత్రాన్ని రూపొందించారు.
అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ది గోట్ లైఫ్’ చిత్రం తెలుగులో ‘ఆడు జీవితం’గా వచ్చి ఆకట్టుకుంది. ఇక చిన్న చిత్రంగా వచ్చిన ‘ప్రేమలు’ పెద్ద విజయాన్ని అందుకుంది. రూ.9 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.130 కోట్లు వసూళ్లు చేసి సూపర్ సక్సెస్‌ను సాధించింది. హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన లవ్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ చిత్రానికి ఇక్కడి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే మలయాళ టాప్ హీరో మమ్ముట్టి ‘భ్రమయుగం’ చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో భిన్నమైన లుక్‌తో మమ్ముట్టి నటన ఆకట్టుకుంది.
ఈ ఏడాది ఆయన నటించిన ‘టర్బో’ కూడా విడుదలవగా, అది మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు టొవినో థామస్ ‘ఏఆర్‌ఎం’ మలయాళంలో భారీ వసూళ్లు సాధించింది.. కానీ తెలుగులో మాత్రం యావరేజ్ టాక్ అందుకుంది. మరోవైపు తెలుగులోనూ నటుడిగా మంచి గుర్తింపును అందుకున్న ఫహాద్ ఫాజిల్.. లీడ్ రోల్‌లో నటించిన ‘ఆవేశం’ మలయాళంలో మెప్పించడంతోపాటు ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే జోజు జార్జ్ హీరోగా నటిస్తూ రూపొందించిన ‘పని’ చిత్రానికి మలయాళంలో పాజిటివ్ టాక్ రాగా, ఇక్కడ నిరాశపరిచింది. ఇక రీసెంట్‌గా మోహన్ లాల్ నటించిన ‘బరోజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కన్నడ కాంతులు
ఈ ఏడాది కన్నడ నుంచి వచ్చిన చిత్రాలేవీ తెలుగునాట సరైన సక్సెస్‌ను అందుకోలేదు. శ్రీమురళి నటించిన ‘బఘీర’ దీపావళికి విడుదలైంది. డాక్టర్ సూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ కథను అందించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగునాట నిరాశపరిచింది. ఇక ధృవ సర్జా హీరోగా నటించిన ‘మార్టిన్’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథను అందించగా, ఉదయ్ కె మెహతా, సూరజ్ మెహతా నిర్మించారు. అలాగే శివ రాజ్‌కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భైరతి రణగల్’ చిత్రం నవంబర్ నెలాఖరున విడుదలై తెలుగులో భారీ పరాజయాన్ని మూటకట్టుకుంది. నర్తన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని గీతా శివ రాజ్‌కుమార్ నిర్మించారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించింది.
ఇక రీసెంట్‌గా రిలీజైన ఉపేంద్ర ‘యూఐ’ తెలుగులో మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా, సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ తాజాగా విడుదలైంది. మరోవైపు పలు హాలీవుడ్ మూవీస్ సైతం తెలుగులో డబ్ అయి ఊహించని విజయాలు అందుకున్నాయి. వాటిలో రీసెంట్‌గా రిలీజైన ‘ముఫాసా’ ది లయన్ కింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని లీడ్ క్యారెక్టర్‌కు హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న తెలుగుతో పాటు తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది.